14 ఏళ్ల ప్రేమకు పవిత్ర బంధం తో హీరో కుమార్తె శుభం!
యాక్షన్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి.
యాక్షన్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ సర్జా ఇంట ఆనందోత్సవాలు వెల్లివిరిసాయి. అర్జున్ చిన్న కుమార్తె అంజనా సర్జా వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అమెరికాకు చెందిన మిత్రుడు, విదేశీయుడైన ఇసాయ్ నట్టర్తో ఏడడుగులు వేశారు. ఈ నెల 19న విదేశీ గడ్డపై జరిగిన వేడుకకు సంబంధించిన ఫొటోలను అంజనా తాజాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
అంజనా - ఇసాయ్ నట్టర్ల ప్రేమకథ అమెరికాలో మొదలైంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సమయంలో అంజనాకు ఇసాయ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్దిరోజుల్లోనే గాఢమైన ప్రేమగా మారింది. 14 ఏళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. పరస్పరం గౌరవించుకుంటూ సాగిన ప్రేమ బంధం వివాహ బంధంగా రూపాంతరం చెందింది. ఇద్దరి ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు కూడా పూర్తిస్థాయిలో సమ్మతి తెలిపారు.
విదేశాల్లో వివాహ వేడుక జరిగినా? భారతీయ సాంస్కృతిక మూలాలను గౌరవిస్తూ హిందూ సంప్రదాయ బద్ధంగానే పెళ్లి జరగడం విశేషం. పట్టు వస్త్రాలు, వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ పద్ధతులతో ఈ వివాహ వేడుక అత్యంత కంటికి ఇంపుగా సాగింది. గతేడాదే ఇద్దరి నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
దక్షిణాది సినీ పరిశ్రమలోని ప్రముఖుల పిల్లలు విదేశీయులను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సీనియర్ నటుడు జగపతి బాబు కుమార్తె కూడా విదేశీయుడిని ప్రేమించి వివాహం చేసుకుని విదేశాల్లోనే స్థిరపడిన సంగతి తెలిసిందే. అదే బాటలో అర్జున్ కుమార్తె కూడా సుదీర్ఘమైన ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
అర్జున్ సర్జా పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా ఇప్పటికే తమిళంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించడంతో పాటు నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకున్నారు. ఇక చిన్న కుమార్తె అంజనా సర్జా నటనకు దూరంగా అమెరికాలో ప్రొఫెషనల్ కెరీర్ను కొనసాగిస్తున్నారు. కుమార్తెల ఇష్టాలకు ప్రాధాన్యతనిస్తూ వారి నిర్ణయాలకు మద్దతుగా నిలిచిన అర్జున్ సర్జాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.