హింస‌ను చూస్తూ పాప్ కార్న్..స‌మోసా ఎలా తింటారు?

విలక్షణమైన నటనతో.. వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిం చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు.

Update: 2026-10-25 14:30 GMT

విలక్షణమైన నటనతో.. వైవిధ్యమైన పాత్రలతో భారతీయ చలనచిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిం చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఊపేస్తున్న భారీ యాక్షన్, హింసాత్మక సినిమాల ట్రెండ్‌పై అమ్మ‌డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం బాక్సాఫీస్ వసూళ్ల కోసం తెరపై క్రూరత్వాన్ని ప్రదర్శించడాన్ని తప్పుబడుతూ అలాంటి వయొలెంట్ చిత్రాలకు తాను పూర్తిగా దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తున్న కొన్ని మాస్ యాక్షన్ చిత్రాలలో హింస మోతాదు మరీ ఎక్కువగా ఉంటోందని రాధికా ఆందోళన వ్యక్తం చేశారు. తెరపై అంతటి భీకరమైన సీన్లు చూస్తూ ప్రేక్షకులు ప్రశాంతంగా వినోదాన్ని ఆస్వాదించడాన్ని అస్సలు ఊహించలేకపోతున్నానని అన్నారు. `స్క్రీన్ పై ఒకరి తలను బేసిన్‌కు కొట్టి చంపడం ..ఎముకలు విరగ్గొట్టే భయంకరమైన దృశ్యాలు వస్తుంటే... థియేటర్లలో కూర్చుని జనాలు పాప్‌కార్న్, సమోసాలు ఎలా తింటారో ఇప్పటికీ అర్థం కావడం లేదని` వ్యాఖ్యానించారు.

ఇలాంటి అతి హింసను వినోదంగా మార్చడం గందరగోళ పరిస్థితికి సంకేతమని అభిప్రాయపడ్డారు. సినిమాలలో విపరీతమైన రక్తం చిందించడం.. క్రూరత్వాన్ని గ్లోరిఫై చేయడం వల్ల సమాజంపై ముఖ్యంగా యువత ఆలోచనా విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వినోదం అందించే క్రమంలో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలే తప్ప హింసనే ప్రధాన వ్యాపార సూత్రంగా మార్చుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.

తన కెరీర్ ఎంపికల గురించి స్పందించింది. పాత్రల్లో వైవిధ్యం ఉన్న చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. `నా మనస్సాక్షికి నచ్చని హింస ఆధారంగా నడిచే ఏ ప్రాజెక్ట్‌లోనూ నేను భాగం కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఎంతటి పెద్ద బ్యానర్ .. క్రేజీ ప్రాజెక్ట్ అయినా విపరీతమైన వయొలెన్స్ ఉన్న సినిమాలకు నో చెప్పడానికే ఇష్టపడతాను` అని రాధికా ఆప్టే వెల్లడించారు.

బాక్సాఫీస్ వద్ద యాక్షన్ సినిమాల జోరు కొనసాగుతున్న తరుణంలో రాధికా ఆప్టే చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. తెరపై ప్రదర్శించే హింస, దాని ఆధారంగా మారిన వినోద సంస్కృతిపై ఆమె లేవనెత్తిన ప్రశ్నలు సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రాధిక ఆప్టే సినిమాల విష‌యానికి వ‌స్తే? నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న `అక్కా` అనే పవర్ ఫుల్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 1980 నాటి గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్‌లో ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య జరిగే ఘర్షణ ప్రధానాంశంగా సాగ‌నుంది. అలాగే ల‌స్ట్ స్టోరీస్ 3 లోనూ అమ్మ‌డు న‌టిస్తోంది. ఈ రెండు త్వ‌ర‌లోనే రిలీజ్ కానున్నాయి.

Tags:    

Similar News