వందల కి.మీ నుంచి వస్తే ఇలా చేశావ్ ఏంటి విశ్వక్..!
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కల్ట్' సినిమా విడుదలకు రెడీ అయింది.
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'కల్ట్' సినిమా విడుదలకు రెడీ అయింది. అక్టోబర్ 30న దీపావళి కానుకగా విడుదల కాబోతున్న కల్ట్ సినిమాపై విశ్వక్ సేన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్స్కి చేరువగా ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఆయన నమ్మకం, సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ అంతా చూస్తే సినిమా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటికే ప్రేక్షకుల్లో కల్ట్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. విశ్వక్సేన్ అభిమానులు సినిమాను భుజాల మీద వేసుకుని సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేస్తున్నారు. ఆదర్శ కుటుంబం వంటి పెద్ద సినిమాతో పోటీగా బరిలోకి దిగుతున్నప్పటికీ ఏమాత్రం టెన్షన్ లేకుండా విశ్వక్ సేన్ కల్ట్ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ ఇంతకు ముందుతో పోల్చితే ఉత్సాహంగా కనిపిస్తున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా కల్ట్ మూవీ...
కల్ట్ సినిమాతో సరికొత్త జోనర్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఘనత తనకు దక్కబోతుందని విశ్వక్ సేన్ ధీమాతో ఉన్నాడు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ స్లాషర్ థ్రిల్లర్ జోనర్‌ను ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా ఆధరిస్తారనే నమ్మకంను ఆయన వ్యక్తం చేస్తున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే నమ్మకంతో ముందుగానే అభిమానుల మీటప్ కు విశ్వక్ ప్లాన్ చేశాడు. తాజాగా విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌తో మీటప్‌కి హైదరాబాద్‌లో ప్లాన్ చేశాడు. వచ్చిన ప్రతి అభిమానితో ఫోటో దిగడం తో పాటు, అభిమానులతో మాట్లాడేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమంను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే ఫంక్షన్ హాల్ లిమిట్ కంటే దాదాపుగా మూడు రెట్ల మంది అభిమానులు విశ్వక్సేన్ ను చూసేందుకు వచ్చారట.
ఫ్యాన్ ఫోటో సెషన్...
అభిమానులు పెద్ద ఎత్తున రావడం తో పాటు, ఇంకా వస్తూనే ఉండటంతో నిర్వాహకులు ముందు జాగ్రత్తగా మొత్తం కార్యక్రమాన్ని రద్దు చేసి, విశ్వక్ సేన్‌ను అక్కడ నుంచి పంపించారని తెలుస్తోంది. వచ్చిన అభిమానుల్లో కనీసం పావు వంతు కూడా విశ్వక్ సేన్‌తో ఫోటోలు దిగలేక పోయారట. చాలా మంది నిరాశతో వెనక్కి వెళ్లినట్లు కార్యక్రమ నిర్వాహకుల ద్వారా తెలుస్తోంది. చిన్న హాల్ కావడంతో పాటు, పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడం, తొక్కిసలాటకు దారి తీసే ప్రమాదం ఉందని, పిల్లలు, అమ్మాయిలు సైతం ఉండటంతో పరిస్థితి చేయి దాటనివ్వకుండా ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశ్వక్సేన్ టీం మెంబర్స్ చెబుతున్నారు. గతంలో జరిగిన ఘటనల అనుభవాలను తీసుకుని ఫోటో షెషన్ నిలిపి వేయడం అనేది మంచి నిర్ణయం అంటూ కొందరు అభినందిస్తే కొందరు మాత్రం అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెళ్లి పోయారట.
పెద్ద ఎత్తున అభిమానులు...
విశ్వక్ సేన్ పై ఉన్న అభిమానంతో ఇంత దూరం వచ్చాం, వందల కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన మాకు చివరకు ఒక్క ఫోటో తీసుకునే అవకాశం కల్పించకుండా వెనక్కి పంపడం దారుణం అని పలువురు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారట. ఇప్పటికే నిర్వాహకులు మరో రెండు రోజుల్లో ఫోటో సెషన్ కి ఏర్పాట్లు చేస్తామని, అప్పుడు ఎంత మంది ఫ్యాన్స్ వచ్చినా ఇబ్బంది లేకుండా, వేదికను ఏర్పాటు చేయడంతో పాటు, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారట. కానీ చాలా దూరం నుంచి హైదరాబాద్ కి వచ్చిన వారు మళ్లీ ఆ రోజు రావడం అనేది కష్టం. కనుక మళ్లీ అంత మంది రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో విశ్వక్ సేన్ టీం మెంబర్స్ ఈ స్థాయిలో జనాలు వస్తారని ఊహించలేదని, తక్కువ మంది వస్తారనే ఉద్దేశంతో ఆ హాల్ ను బుక్ చేశామని చెబుతున్నారట. ఈ విషయమై విశ్వక్ సేన్ స్పందించాడు. ఫ్యాన్స్ కు క్షమాపణలు చెబుతూ లేఖను విడుదల చేశాడు.
విశ్వక్ సేన్ క్షమాపణలు...
విశ్వక్ సేన్... మీ నుంచి ప్రేమ మేము ఊహించిన దాని కంటే ఎక్కువ వచ్చింది. దాన్ని మేము ఊహించలేక సరైన ఏర్పాట్లు చేయలేక పోయాం. నాతో ఫోటో దిగాలని వచ్చి, నిరాశగా వెనక్కి వెళ్లి పోయిన ప్రతి ఒక్కరికి క్షమాపణ చెబుతున్నా. త్వరలో మరో ఫ్యాన్ ఫోటో సెషన్ పెట్టుకుందాం. మీ అందరినీ కలవలేక పోయినందుకు బాధగా ఉంది. అందరికీ సమాన అవకాశం దక్కే విధంగా ఈసారి మంచిగా ఏర్పాట్లు చేస్తాం. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు, అభిమానంకు కృతజ్ఞతలు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.