మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీపై బిగ్ న్యూస్!
అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, నాగార్జున, బాలకృష్ణ వంటి దిగ్గజ హీరోలు టీవీ హోస్టులుగా దూసుకుపోతున్నారు.
అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, నాగార్జున, బాలకృష్ణ వంటి దిగ్గజ హీరోలు టీవీ హోస్టులుగా దూసుకుపోతున్నారు. మాటీవీలో `మీలో ఎవరు కోటీశ్వరుడు?` షోతో మెగాస్టార్ చిరంజీవి కూడా బుల్లితెర హోస్ట్ గా అడుగుపెట్టారు. కానీ ఆయన ఆ తర్వాత పూర్తిగా సినిమాలతోనే బిజీ అయిపోయారు. కానీ ఈసారి మెగా బాస్ డిజిటిల్ ఎంట్రీ ఇస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరు ఓ సరికొత్త షోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ `ఆహా` వేదికగా విజయవంతంగా టాక్ షో నిర్వహిస్తుండగా.. నాగార్జున `బిగ్ బాస్` షోతో టెలివిజన్ అలాగే ఓటీటీలో అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ డిజిటల్ ఎంట్రీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే ఈసారి చిరు పూర్తిగా భిన్నమైన ఫార్మాట్‌లో ఓ సెలబ్రిటీ టాక్ షోను చేయనున్నారు. మొదట తన జీవితం - సినిమా ప్రయాణంపై ఒక డాక్యుమెంటరీ చేయాలని.. ఆ తర్వాత తన ఆటోబయోగ్రఫీ రాయాలని భావించినా.. చివరికి ప్రేక్షకులను అలరించేలా ఈ టాక్ షో ఫార్మాట్‌కే ఆయన మొగ్గు చూపారు.
ఈ ప్రత్యేకమైన షో ద్వారా మెగాస్టార్ తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర విశేషాలు, జ్ఞాపకాలను పంచుకోవడంతో పాటు, ఇండస్ట్రీలోని ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించి వారితో సరదాగా ముచ్చటించనున్నారు. తనతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న సహనటులు, దర్శకులతో ఆయన జరిపే ఈ సంభాషణలు అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయం. త్వరలోనే ఈ నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`లో నటిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది కాకుండా.. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కాకా (మెగా 158) ప్రాజెక్ట్ షూటింగ్ పనులు వేగంగా జరుపుకుంటుండగా.. వీటితో పాటు నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఒక ప్రత్యేక టాక్ షో ద్వారా కూడా చిరంజీవి అలరించేందుకు సిద్ధమవుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది.