సంస్కృతి గురించి మాట్లాడేవారే నా ఫ్యామిలీని బూతులు తిట్టారు!

బాలీవుడ్ నటి కృతిసనన్ రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా నటించిన ఆభరణాల ప్రకటన పెద్ద వివాదానికి దారితీసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-10-25 12:30 GMT

బాలీవుడ్ నటి కృతిసనన్ రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా నటించిన ఆభరణాల ప్రకటన పెద్ద వివాదానికి దారితీసిన సంగ‌తి తెలిసిందే. ఆ యాడ్‌లో అమ్మ‌డు ధరించిన దుస్తులపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి ఎదురైన ట్రోల్స్, మహిళలపై జరుగుతున్న విమర్శల గురించి కృతిసనన్ తొలిసారిగా స్పందించారు. తన కుటుంబ సభ్యులపై కూడా దారుణమైన పదజాలంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

నటి కరీనా కపూర్ నిర్వహిస్తున్న `వాట్ ఉమెన్ వాంట్` టాక్ షోలో పాల్గొన్న కృతిసనన్ ఈ వివాదంపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. సాధారణంగా తాను ఇలాంటి విషయాలపై స్పందించనని.. కానీ ఇది కేవలం తన ఒక్కదానికి సంబంధించిన సమస్య కాదని.. సమాజంలో మహిళలను ప్రతి చిన్న విషయానికి ఎలా పరిశీలిస్తారో? చెప్పే పెద్ద సమస్య అన్నారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలనే దానిపై నిత్యం ఎందుకు తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు.

ఈ వివాదం సమయంలో కొందరు వ్యక్తుల సంస్కృతి, సాంప్రదాయాల గురించి గొప్పలు చెప్పారని కానీ అదే నోటితో తన తల్లిదండ్రులు, సోదరి సోషల్ మీడియా పోస్టులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన భాషలో కామెంట్లు చేశారని కృతిసనన్ వాపోయారు. `సంస్కృతి గురించి మాట్లాడేవారే ఇలాంటి బూతులు మాట్లాడటం విచిత్రంగా ఉంది. సెలబ్రిటీలుగా మేం సులభమైన లక్ష్యాలుగా మారుతున్నాం. మేమూ మనుషులమే. ఇలాంటి ట్రోల్స్ మాకూ బాధ కలిగిస్తాయి` అని భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ యాడ్‌లో కృతిసనన్ బ్రాలెట్, స్కర్ట్ ధరించి తన సోదరుడికి రాఖీ కట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగలో ఆధునిక దుస్తులు ధరించడాన్ని తప్పుబడుతూ ట్రోల్ చేశారు. విపరీతమైన వ్యతిరేకత రావడంతో ఆ బ్రాండ్ ప్రకటనను తొలగించింది. అయితే పండుగలు దుస్తుల్లో ఉండవని.. వాటి వెనుక ఉన్న భావోద్వేగాల్లో ఉంటాయని అప్పట్లో కృతిసనన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

మహిళలపై లోతుగా వేళ్లూనుకున్న పితృస్వామ్య భావజాలం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని కృతిసనన్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి అసమానతలను రూపుమాపేందుకు మహిళలందరూ గొంతు విప్పాలని.. తమ కోసం తాము నిలబడటం ఎంతో కీలకమని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారికి ఎవరిచ్చారు? ఆ హక్కు అని కృతి స‌న‌న్ మండిపడ్డారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు బాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున‌ చర్చకు దారితీస్తున్నాయి. దీంతో కృతి లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు ఎవ‌రు స‌మాధానం చెబుతార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News