వసూళ్లు వస్తున్నా మిక్స్ డ్ టాకే.. మరి నవంబర్‌లో?

సినిమా బాగుందనే టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకుంటే పొరపాటే. కొన్ని సినిమాలకు టాక్ ఎలా ఉన్నా వసూళ్లు వస్తున్నాయి.

Update: 2026-10-25 09:17 GMT

సినిమా బాగుందనే టాక్ వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనుకుంటే పొరపాటే. కొన్ని సినిమాలకు టాక్ ఎలా ఉన్నా వసూళ్లు వస్తున్నాయి. మరికొన్ని చిత్రాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చినా, ఆ తర్వాత స్పీడ్ తగ్గుతోంది. అక్టోబర్‌ లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనిపించిన పరిస్థితి ఇదే. పండగ సీజన్, హీరోల క్రేజ్ కలెక్షన్లకు కలిసొచ్చినా.. ప్రేక్షకులందరినీ మెప్పించిన సినిమాలు మాత్రం తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి ఫోకస్ నవంబర్ రిలీజ్ లపై పడింది.

అక్టోబర్‌ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన 'రణబాలి' మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే సినిమాకు వచ్చిన టాక్ మాత్రం పూర్తిగా ఒకేలా లేదు. కథలో కొన్ని సీన్స్ నచ్చాయని చెప్పిన ప్రేక్షకులే, మరికొన్ని చోట్ల స్లోగా సాగిందని అభిప్రాయపడ్డారు. అయినా పండగ సెలవులు, హీరోల క్రేజ్ సినిమాకు యూజ్ అయ్యాయి. రజనీకాంత్ 'జైలర్ 2' విషయంలోనూ భారీ వసూళ్లతో పాటు భిన్నమైన అభిప్రాయాలు కనిపించాయి. రజనీ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకున్నా, కథ విషయంలో మాత్రం అందరూ ఒకేలా చెప్పడం లేదు.

మరోవైపు చిన్న, మిడ్ రేజ్ సినిమాలు కూడా ప్రేక్షకులను పూర్తిగా థియేటర్లకు రప్పించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ నెలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ నెలలో శర్వానంద్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నవంబర్ 5న 'రామాయణ: పార్ట్ 1', 6న 'హఠః', 'సమ్మర్ హాలిడేస్' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు సూర్య నటించిన సీన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవంబర్ రెండో వారంలో శర్వానంద్ 'భోగి', మౌళి తనూజ్ 'దొంగ నా కొడుకు', 'ఇట్లు అర్జున' సినిమాలు విడుదల కానున్నాయి. మూడో వారంలో విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది రిపీట్', దుల్కర్ సల్మాన్ 'ఆకాశంలో ఒక తార' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ధనుష్ నటించిన తమిళ చిత్రం 'ఓఎమ్ చాప్టర్ 1: ఉధిరమ్', హాలీవుడ్ సినిమా 'ది హంగర్ గేమ్స్: సన్‌రైజ్ ఆన్ ది రీపింగ్' కూడా అదే సమయంలో విడుదల కానున్నాయి. నెల చివర్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'హైంధవ', రష్మిక మందన్న నటించిన 'మైసా' సినిమాలు వస్తున్నాయి.

ఇన్ని సినిమాలు విడుదలవుతున్నా, వాటిలో ఎన్ని ప్రేక్షకులను నిజంగా మెప్పిస్తాయన్నదే అసలు విషయం. పెద్ద హీరో సినిమా కావడం, భారీగా ప్రమోట్ చేయడం వల్ల మొదటి రోజు వసూళ్లు రావచ్చు. కానీ ఆ తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే కంటెంట్ బాగుండాలి. సినిమా చూసినవాళ్ల మౌత్ టాక్ మెయిన్. మరి అక్టోబర్‌ లో మిక్స్‌ డ్ టాక్ మధ్య వసూళ్లు సాధించిన సినిమాలు కనిపించాయి. నవంబర్‌ లో మాత్రం ఆ పరిస్థితి మారుతుందా, కనీసం కొన్ని సినిమాలైనా పూర్తి పాజిటివ్ టాక్‌ తో బాక్సాఫీస్ వద్ద నిలబడతాయా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News