సినిమా రంగంలో AI ఎఫెక్ట్ : హాలీవుడ్ నుండి భారతీయ వెండితెర వరకు పెను మార్పులు!
ప్రపంచ సినిమా రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. స్క్రిప్ట్ రచన, ప్రీ-విజువలైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వరకు ప్రతీ విభాగంలోనూ ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రపంచ సినిమా రంగాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సరికొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది. స్క్రిప్ట్ రచన, ప్రీ-విజువలైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), డబ్బింగ్, పోస్ట్-ప్రొడక్షన్ వరకు ప్రతీ విభాగంలోనూ ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో నెలల తరబడి సమయం.. కోట్లాది రూపాయల ఖర్చు అయ్యే సంక్లిష్టమైన పనులను ఏఐ ఈ రోజుల్లో అత్యంత వేగంగా, తక్కువ వ్యయంతో.. కచ్చితత్వంతో పూర్తి చేయడానికి తోడ్పడుతోంది.
అయితే హాలీవుడ్ చిత్రసీమ ఏఐ వినియోగంలో ఎప్పుడూ ముందుంటోంది. `ది ఐరిష్‌మ్యాన్` వంటి చిత్రాల్లో వయసు పైబడిన నటులను యవ్వనంగా చూపించడానికి డీఏజింగ్ టెక్నాలజీ, `అవతార్` సిరీస్‌లో అధునాతన మోషన్ క్యాప్చర్ - ఫోటోరియలిస్టిక్ ఎన్విరాన్మెంట్లను సృష్టించడానికి ఏఐని విస్తృతంగా ఉపయోగించారు. అంతేకాకుండా గొంతును రీక్రియేట్ చేయడం.. చనిపోయిన నటుల డిజిటల్ అవతార్లను తెరపైకి తీసుకురావడంలో హాలీవుడ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. అదే సమయంలో స్క్రిప్ట్ విశ్లేషణ, బాక్స్ ఆఫీస్ అంచనాలు, డిజిటల్ రైట్స్ రక్షణ కోసం కూడా అక్కడి ప్రొడక్షన్ హౌస్‌లు ఏఐ సిస్టమ్‌లను వాడుతున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలోని టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కూడా ఏఐ సాంకేతికతను వేగంగా స్వీకరిస్తుండటం ఆసక్తికరం. నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక `రామాయణం` చిత్రంలో పలు భాషల్లో డైలాగ్స్‌కు అనుగుణంగా కచ్చితమైన పెదవుల కదలికలు తీసుకురావడానికి `బ్రహ్మ ఏఐ` టెక్నాలజీని ఉపయోగిస్తుండటం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. అలాగే తమిళ చిత్రం GOAT లో దివంగత నటుడు విజయకాంత్ డిజిటల్ రూపా(ఏఐ డీ ఏజింగ్- అవతార్)న్ని పునఃసృష్టించడం, పలు చిత్రాల్లో పాన్-ఇండియా డబ్బింగ్‌ను విభిన్న గొంతులతో సులభతరం చేయడం వంటి ప్రక్రియలు విస్తృతంగా సాగుతున్నాయి.
ఏఐ రాకతో విజువల్ ఎఫెక్ట్స్ లో ప్రొడక్షన్ వేగం పెరిగి. వ్యయం తగ్గడమే కాకుండా.. దర్శకుల సృజనాత్మక ఊహలకు సరిహద్దులు లేకుండా పోయాయి. అయితే మానవ భావోద్వేగాలు.. అసలైన నటన .. కళాకారుల ఉపాధిపై ఏఐ ప్రభావం చూపుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా సాంకేతికతను కేవలం ఒక సాధనంగా వాడుకుంటూ మానవ సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇచ్చినంత కాలం ఏఐ సినిమా రంగానికి ఒక గొప్ప వరంగానే నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
చట్టపరమైన & ఒప్పంద జాగ్రత్తలు:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్ ఫేక్ , వాయిస్ క్లోనింగ్ సాంకేతికతలు వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, నటులు తమ డిజిటల్ రూపం .. గొంతును దుర్వినియోగం కాకుండా కాపాడుకోవడానికి సాంకేతిక, చట్టపరమైన - ఒప్పందాల పరంగా పలు కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సినిమాల్లో నటించే ఒప్పందాలు చేసుకునేటప్పుడే, తమ ముఖం లేదా గొంతును కేవలం ఆ ఒక్క సినిమాకే పరిమితం చేయాలని స్పష్టమైన క్లాజులు ఇటీవల చేర్చుతున్నారు. భవిష్యత్తులో ఏఐ లేదా డిజిటల్ అవతార్ల రూపంలో ఈ డేటాను తిరిగి ఉపయోగించకూడదు అని ముందే ఒప్పందం చేసుకుంటున్నారు.
తమ డిజిటల్ స్కాన్లను వాడాల్సి వస్తే ప్రతీ ప్రాజెక్ట్కూ లేదా ప్రతీసారి వేర్వేరుగా ప్రత్యక్ష అనుమతి తీసుకోవాలనే నిబంధన విధిస్తున్నారు. ఒకసారి ఇచ్చిన సమ్మతి శాశ్వత హక్కుగా మారకుండా చూసుకుంటున్నారు. రైట్ ఆఫ్ పబ్లిసిటీ.. పర్సనాలిటీ రైట్స్ ప్రకారం తమ రూపం, గొంతు, పేరును వాణిజ్యపరంగా ప్రకటించే లేదా అమ్మే హక్కులను నటులు తమ సొంత ఎస్టేట్ లేదా లీగల్ టీమ్‌ల వద్ద మాత్రమే ఉంచుకుంటున్నారు.