సైబ‌ర్ పైర‌సీకి సెన్సార్ బోర్డ్ మిన‌హాయింపు కాదు.. డేటా లీక్ క‌ల‌క‌లం!

చలనచిత్ర పరిశ్రమను సైబర్ భద్రతా లోపాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి.

Update: 2026-10-25 11:36 GMT

చలనచిత్ర పరిశ్రమను సైబర్ భద్రతా లోపాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. కేవలం సినిమాలే కాకుండా సెన్సార్ బోర్డు కూడా పైరసీ - డేటా లీక్‌ల బారిన పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) అధికారిక పోర్టల్ అయిన `ఇ-సినెప్రమాణ్` భద్రతా లోపానికి గురికావడంతో భారీ డేటా బ్రీచ్ చోటు చేసుకుంది. ఈ సెక్యూరిటీ ఉల్లంఘన కారణంగా 500కి పైగా సినిమాలకు సంబంధించిన ర‌హ‌స్య‌ పత్రాలు, టైటిల్స్.. సర్టిఫికేషన్ రికార్డులు బహిర్గతమయ్యాయి.

ఈ భద్రతా లోపం ద్వారా విడుదల కాని సినిమాల టైటిల్స్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం మరింత దిగ్భ్రాంతికరమైన విషయం. ఈ సున్నితమైన వ్యాపార డేటా కంటెంట్ అకస్మాత్తుగా బట్టబయలు కావడంతో సినీ నిర్మాతలు, పరిశ్రమ నిపుణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

సినిమా థియేట్రికల్ విడుదలకు ముందే సర్టిఫికేషన్ కోసం చిత్ర నిర్మాతలు ఉపయోగించే ప్రభుత్వ డిజిటల్ పోర్టల్ `ఇ-సినెప్రమాణ్` ద్వారా ఈ లీకేజ్ జరిగినట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు గుర్తించే లోపు ఈ గోప్యమైన ఫైళ్లు డిజిటల్ ఆర్కైవింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అనేక రోజుల పాటు ఆన్‌లైన్‌లోనే బహిరంగంగా దర్శనమిచ్చాయి.

ఒరిజిన‌ల్ వీడియో ఫైల్స్ గుట్టు బ‌య‌ట‌ప‌డ‌క‌పోయినా కానీ... సెన్సార్ వివరాలు లీకైపోవ‌డం సమస్యలను సృష్టిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ సినిమా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన కొన్ని వివరాలు కూడా పబ్లిక్ అయ్యాయి.

ఈ ఘటనపై సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) స్పందించి అధికారిక విచారణను ప్రారంభించింది. ఇ-సినెప్రమాణ్ పోర్టల్‌పై పూర్తి స్థాయి భద్రతా ఆడిట్‌ను చేపట్టింది. అయితే ఇంకా విడుదల కాని చిత్రాలకు సంబంధించిన ఈ గోప్యమైన సమాచారం లీక్ కావడం వల్ల భవిష్యత్తులో బాక్సాఫీస్ వసూళ్లు, థియేట్రికల్ రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడుతుందని నిర్మాతలు భయపడుతున్నారు.

Tags:    

Similar News