అది మరో గాయపడ్డ సింహం అయ్యి ఉంటుందా..?

తెలుగు సినిమాల్లో అమెరికా ను చూపించడం కొత్తేం కాదు. చాలా కాలం నుంచి ఇండియన్‌ సినిమాలు అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి.;

Update: 2026-03-04 06:33 GMT

తెలుగు సినిమాల్లో అమెరికా ను చూపించడం కొత్తేం కాదు. చాలా కాలం నుంచి ఇండియన్‌ సినిమాలు అమెరికా చుట్టూ తిరుగుతున్నాయి. అమెరికాలో షూటింగ్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రస్తుతం అమెరికానే కథా వస్తువుగా తీసుకుని సినిమాలను రూపొందించేందుకు గాను మేకర్స్‌ ముందుకు రావడం ట్రెండ్‌గా మారింది. ఈ మధ్య కాలంలో అమెరికా నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. మరికొన్ని సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. తెలుగులో అమెరికా నేపథ్యంలో రూపొందుతున్న ఒక సినిమా 'గాయపడ్డ సింహం'. తరుణ్‌ భాస్కర్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవలే టీజర్‌ విడుదల చేయడం జరిగింది. అమెరికా వెళ్లాలని చిన్నప్పటి నుంచి కలలు కనే కుర్రాడికి ట్రంప్‌ వచ్చిన తర్వాత ఎదురయిన సమస్య నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ సాగుతుందని క్లీయర్‌గా టీజర్‌లో చూపించడం జరిగింది.

తరుణ్‌ భాస్కర్‌ గాయపడ్డ సింహం...

గాయపడ్డ సింహా పూర్తి స్థాయి వినోదాత్మకంగా సాగుతుందని టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. అయితే అమెరికా వెళ్లలేకపోయిన కుర్రాడి కథను ఆ సినిమాలో చూపిస్తూ ఉండగా, ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ అనిల్‌ సుంకర ఆసక్తికర ప్రకటన చేయడం జరిగింది. యూఎస్‌ఏలో F-1, H-1 వీసాల కోసం భారతీయులు పడే ఇబ్బందులు, వారి మానసిక పరిస్థితులను వినోదాత్మకంగా, మనసుకు హత్తకునే విధంగా ఒక సినిమాను తీసుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ స్టోరీ లైన్‌ తో స్క్రిప్ట్‌ ను రెడీ చేయాల్సిందిగా ఇప్పటికే రచయితలకు చెప్పాం. ఎప్పుడైతే రైట్స్ పూర్తి స్థాయి కథతో వస్తారో అప్పుడు సినిమాను మొదలు పెడతామని నిర్మాత అనిల్‌ మరోసారి చెప్పుకొచ్చారు. అమెరికాలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న అనిల్‌ కి అక్కడి పరిస్థితుల గురించి క్లీయర్‌గా తెలుసు. అందుకే ఈ కథను ఆయన చూపించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.

యూఎస్‌ఏలో ఇండియన్స్‌...

యూఎస్‌ఏలో ఉండే పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తే తప్పకుండా కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం. ఈ పాయింట్‌తో సినిమా వర్కౌట్‌ అవుతుందని, యూనిక్‌ పాయింట్‌ అవుతుందని ఇప్పటికే పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఇండియన్స్ ఎదుర్కొనే సమస్యలను వినోదాత్మకంగా చూపించడం ద్వారా చాలా మందికి ఒక మంచి మెసేజ్‌ని కూడా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. అనిల్‌ సుంకర ఈ సినిమా మొత్తంను యూఎస్‌లో చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ప్రకటించబడ్డ గాయపడ్డ సింహం సినిమాతో అనిల్‌ సుంకర తీయబోతున్న సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదని, పూర్తిగా వేరు వేరుగానే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అనిల్‌ తీసుకురాబోతున్న సినిమా కచ్చితంగా మరో గాయపడ్డ సింహం మాత్రం అయ్యి ఉండదు అంటున్నారు.

అనిల్‌ సుంకర నిర్మాణంలో మూవీ..

F-1, H-1 వీసా అనుభవాలను తీసుకుని మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేస్తే వెంటనే సినిమాను మొదలు పెట్టేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ నిర్మాత అనిల్‌ సుంకర సోషల్‌ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాయింట్‌తో ఎన్నో కథలు రెడీ అవుతున్నాయి. ప్రముఖ రైటర్‌లు సైతం స్టోరీ రాస్తున్నట్లు తెలుస్తోంది. మంచి భావోద్వేగంతో నిండిన కథను తీసుకుని, వినోదాత్మకంగా రూపొందించాలని అనిల్‌ సుంకర ప్లాన్‌ చేస్తున్నారు. నిర్మాతగానే కాకుండా దర్శకత్వంపై కూడా అనిల్‌ కి పట్టు ఉంది. అందుకే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి అనిల్‌ సుంకర చేసిన ఈ ప్రకటనతో మరో అమెరికా బ్యాక్‌డ్రాప్‌ మూవీ రాబోతుందని క్లారిటీ వచ్చింది. ఈ ఏడాదిలో సినిమా ప్రారంభం అయితే వచ్చే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చూడాలి.

Tags:    

Similar News