చిరు, వెంకీ ఓకే.. మరి చిరు, బాలయ్య కాంబో సంగతేంటి?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.;

Update: 2026-01-12 17:26 GMT

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది. ముఖ్యంగా సినిమాలో చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇద్దరు సీనియర్ స్టార్స్ కలిసి స్క్రీన్ పై కనిపించడంతో థియేటర్లలో ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్, డైలాగ్ డెలివరీలో ఇద్దరూ ఒకరినొకరు మించి నటించారని అంతా ప్రశంసిస్తున్నారు.

అయితే వెంకీ, చిరు కాంబో అలరించడంతో టాలీవుడ్‌ లో మరోసారి స్టార్ల కాంబినేషన్లపై చర్చ మొదలైంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ – చిరంజీవి కాంబినేషన్ గురించి సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది. ఇప్పటికే వారిద్దరూ సినిమా చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఎప్పటి నుంచో అభిమానుల్లో ఉంది. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారులో చిరు– వెంకీ కాంబో సక్సెస్ కావడంతో, అదే తరహాలో చిరంజీవి– బాలయ్య కలిసి వస్తే థియేటర్లు ఊగిపోతాయని అభిమానులు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు వచ్చాయి. బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనే కోరిక తనకు ఉందని చిరంజీవి ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. అంతేకాదు, ఆ సినిమా ఫ్యాక్షన్ జోనర్‌ లో ఉంటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ లో పవర్‌ ఫుల్ పాత్రల్లో చిరు – బాలయ్య కనిపిస్తే ఎలా ఉంటుందో అనే ఐడియాలతో సోషల్ మీడియా నిండిపోయింది.

అయితే ఆ కాంబినేషన్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. చిరంజీవి వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుండగా.. బాలకృష్ణ కూడా తన స్టైల్‌ కు తగ్గ కథలతో అభిమానులను అలరిస్తున్నారు. ఇద్దరి డేట్స్, సరైన కథ, దర్శకుడు… ఇవన్నీ కుదిరితే కానీ ఆ డ్రీమ్ కాంబినేషన్ సాధ్యం కాదని సినీ విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్నారు.

మరోవైపు, చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్ లో కేవలం సినిమా మాత్రమే కాదు, అది ఒక పెద్ద పండుగలా ఉంటుందని ఇద్దరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద మల్టీ స్టారర్‌ గా నిలుస్తుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాక్షన్ జోనర్‌ లో ఇద్దరూ తమదైన మాస్ ఇమేజ్‌ తో కనిపిస్తే, బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా తెచ్చిన జోష్ తో చిరంజీవి – బాలయ్య కాంబినేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇది కేవలం చర్చగా మిగులుతుందా? లేక త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాలి. అప్పటివరకు అభిమానులు మాత్రం ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు.

Tags:    

Similar News