సిరివెన్నెల హెల్త్ అప్డేట్..!

Update: 2021-11-30 04:21 GMT
టాలీవుడ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. న్యుమోనియాతో బాధపడుతున్న సీతారామశాస్త్రి ప్రస్తుతం సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఆయన్ను ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. సిరివెన్నెల జ్వరంతో పాటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం కిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

''టాలీవుడ్‌ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాము'' అని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
Read more!

సీతారామశాస్త్రి గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల సిరివెన్నెల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన మరోసారి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కోలుకునే వరకు ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. త్వరలో ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కొత్త హెల్త్ బులెటిన్ వెలువడే అవకాశం ఉంది.

కాగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు చిత్రపరిశ్రమలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ పాటలను అందించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 'స్వర్ణ కమలం', 'గాయం', 'శుభలగ్నం', 'సింధూరం', 'చక్రం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సీతారామశాస్త్రి నంది అవార్డులు అందుకున్నారు.


Tags:    

Similar News