సంపూని చూసైనా స్టార్స్ కదులుతారా?

Update: 2015-11-30 11:30 GMT
ఇప్పుడు చెన్నై మహానగరం మహా కష్టంలో ఉంది. భారీ వర్షాలు, వరద ముంచెత్తడంతో.. సగానికి పైగా సిటీ నీటిలో మునిగిపోయింది. తమిళనాడు అంతా వర్షాల ప్రభావం ఉన్నా... చెన్నై సిటీలో ఇంకా ఎక్కువగా ఉంది. చివరకు రవాణా, సమాచార వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయంటే.. ఈ కోలీవుడ్ కేపిటల్ పరిస్థితి అర్ధమవుతుంది. ఒకవైపు జయలలిత ప్రభుత్వం వీలైనన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది.

ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ జాగ్రత్తల కారణంగానే.. ప్రాణ నష్టంలేకుండా ఈ కష్టాన్ని దాటగలుగుతోంది చెన్నై. మరోవైపు తుఫాన్ బాధితుల కోసం కోలీవుడ్ తారలు కదులుతున్నారు. తమిళ స్టార్ సూర్య.. తన స్వచ్ఛంద సంస్థ తరఫున పాతిక లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. నడిగర్ సంఘం సెక్రటరీగా తాజాగా ఎన్నికైన విశాల్ 10లక్షలు ఇవ్వగా. ధనుష్ ఐదు లక్షలు ఇచ్చాడు. తమిళ స్టార్ హీరోలు ఇలా ముందుకొస్తుంటే.. టాలీవుడ్ తరఫున బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మొదటి అడుగు వేశాడు. తన వంతుగా 50వేల రూపాయలు చెన్నైకి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంతే కాదు.. గతేడాది వైజాగ్ కు హుద్ హుద్ తుఫాన్ ముంచెత్తినపుడు.. తమిళనటులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారని గుర్తు చేశాడు. టాలీవుడ్ అంతా కదిలి వచ్చి, చెన్నై బాధితులను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశాడు సంపూ.

నిజానికి సంపూ ఇచ్చిన మొత్తం చిన్నదే కావచ్చు.. పక్క రాష్ట్రానికి కష్టంవస్తే మనకేంటి అనుకోకుండా.. తనవంతుగా, తన స్థాయికి తగినట్లుగా ఇవ్వాలన్న ఆలోచనను అభినందించాలి. ఇప్పటికీ ముందుకు రాని స్టార్ హీరోలకు మార్గదర్శకుడుగా నిలవడంతో... సంపూర్ణేష్ కు ఆన్ లైన్ లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇఫ్పటికైనా మన స్టార్లు ముందుకొస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News