ఓటీటీ పేరుతో ప‌బ్లిసిటీ లేకుండా దండుకోవ‌డ‌మా?

Update: 2021-07-16 14:30 GMT
అగ్ర హీరోల చిత్రాలు థియేట‌ర్లో రిలీజ్  చేయాలంటే ముంద‌స్తు ప్ర‌చారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. స‌రిగ్గా రిలీజ్ కు ప‌దిరోజుల‌ స‌మ‌యం ఉంద‌న‌గానే టీమ్ అంతా ప్ర‌చారానికే టైమ్ కేటాయించాల్సి ఉంటుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ పూర్తిచేసిన త‌ర్వాత హీరోలు హీరోయిన్లు ఇంట‌ర్వ్యూలతో ఫుల్ బిజీ అవ్వాలి. ప‌త్రిక‌లు- ఛాన‌ళ్లు- వెబ్ మీడియా అంటూ న‌టీన‌టులంతా మీడియా హౌస్ ల‌న్నీ చుట్టేయాలి. కానీ ఇప్పుడు ఆ సాంప్ర‌దాయం మారుతోందా?

ఒక‌ప్ప‌టితో పోలిస్తే అంతా మారుతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ఇంత‌కుముందు గోడ పోస్ట‌ర్ వేయ‌నిదే ప్ర‌చారం లేదు. కానీ ఇప్పుడ‌లా కాదు. అంతా ఆన్ లైన్ సోష‌ల్ మీడియాల్లోనే పోస్ట‌ర్ల ప్ర‌చారం. అయితే డిజిట‌ల్ ప్రచారం ఎంత ఉన్నా మారుమూల ప‌ల్లెల‌కు సినిమా వెళ్లాలి అంటే .. మాస్ ని ఏట్రాక్ట్ చేయాలంటే క‌చ్ఛితంగా మైక్ ప‌బ్లిసిటీ గోడ పోస్ట‌ర్ ప‌బ్లిసిటీ ఉండాల్సిందేన‌నేది ఒక సెక్ష‌న్ విశ్లేష‌ణ‌. ఇంకా ఊర‌మాస్ లో అంత‌గా డిజిట‌ల్ అడిక్ష‌న్ లేదు. మాస్ ప‌బ్లిక్ మొబైల్ లో చూసినా యూట్యూబ్ లో చూసినా కానీ ఓటీటీ సైన‌ప్ అవ్వ‌డం పై ఇంకా పూర్తిగా అవ‌గాహ‌న ఉండేందుకు ఆస్కారం లేదు. వీధి వీధినా ఊరూరా ప్రాంతాల వారీగా ప్ర‌చారం  కూడా అవ‌స‌రం. ఊర మాస్ కి చేరువ కావ‌డం అత్య‌వ‌స‌రం. అందుకే సాంప్రదాయ విధానాన్ని వ‌దులుకుని పూర్తిగా క్లాస్ సెక్ష‌న్ కే ప‌రిమిత‌మై డిజిట‌ల్ నే న‌మ్మడం స‌రికాద‌న్న విశ్లేష‌ణ ఒక సెక్ష‌న్ లో క‌నిపిస్తోంది.

వీట‌న్నింటికి మించి రిలీజ్ స‌మ‌యంలో ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్స్ చేయాల్సి ఉంటుంది. ఊళ్లు కాలేజ్ లు స్కూళ్ల‌కు టూర్ లు వెళ్లి యూత్ ని ఆక‌ర్షించాల్సి ఉంటుంది. నేడే రిలీజ్.. రేపే రిలీజ్ అంటూ అన్ని ఫార్మాట్ల‌ మీడియాల్లోనూ బోలెడంత ప్ర‌చారం అవ‌స‌రం. ఈ ప్ర‌చారానికి కొంత‌ ఖ‌ర్చవుతుంటుంది. కానీ దేని ప్ర‌యోజ‌నం దానికి ఉంది. సినిమాకి రీచ్ ఎక్కువ‌గా ఉంటుంది. సినిమాకి హైప్ తెచ్చే ప్ర‌చార మార్గ‌మిదే. కానీ క‌రోనా రంగ ప్ర‌వేశంతో అంతా మారింది. ఇప్పుడు ఓటీటీల రాక‌తో సాంప్ర‌దాయ విధానం మ‌రింత‌గా క‌నుమ‌రుగ‌వుతోంది.

ఏడాదిన్న‌ర‌గా సినిమాల‌న్నీ ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి థియేట‌ర్ల‌లో రిలీజ్ కు క‌ల్పించినంత ప్ర‌చారం ఓటీటీల‌కు ఎందుకు చేయ‌డం లేదు?  థియేట‌ర్ రిలీజ్ వేరుగా..ఓటీటీ రిలీజ్ ని వేరుగా ఎందుకు చూస్తున్న‌ట్లు? మ‌రి ఈ త‌ర‌హా ఒర‌వ‌డి వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది ఎవ‌రు? అంటే చాలానే విశ్లేషించాలి.
 
ఓటీటీ- డిజిట‌ల్ కి ప్ర‌చారం అవ‌స‌రం లేద‌ని నిర్మాత‌లు భావించ‌డం ఒక కోణంలో ప్ర‌మాద‌క‌రంగా మారుతోంద‌నే విశ్లేష‌ణ సాగుతోంది. దీనివ‌ల్ల‌ సినిమా రీచబులిటీ ఎక్కువ‌గా ఉండ‌టం లేద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేవ‌లం ఎక్స్ క్లూజివ్ అని ఓటీటీ లో యాడ్స్ ఇచ్చి స‌రిపెట్ట‌డం భ‌విష్య‌త్ సినిమాకే ప్ర‌మాద‌క‌ర‌మ‌నే సంకేతాలందుతున్నాయి. ఓటీటీల పాలై సినిమా స‌రిగా రీచ్ కాక‌పోతే గ‌నుక‌ హీరోల మార్కెట్ పై అది తీవ్ర ప్ర‌భావం చూపుతుందని విశ్లేషిస్తున్నారు. అలాగే నిర్మాత‌ల‌కు కూడా ఇది ఒక కోణంలో న‌ష్టం తెచ్చేందుకు ఆస్కారం ఉంది.

అప్ప‌ట్లో క‌మ‌ల్ హాస‌న్ తీసుకొచ్చిన‌ డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) వ‌ల్ల థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌..ప‌రిశ్ర‌మ ఎలా దెబ్బ తింటుందోన‌ని ప‌లువురు నిపుణులు విశ్లేషించిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్య‌వ‌స్థ‌ను తీసుకొస్తే న‌ష్ట‌పోయేది మ‌న‌మేన‌ని  దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌-క‌మ‌ల్ తో పెద్ద యుద్ద‌మే చేసి స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఓటీటీ రిలీజ్ వ‌ల్ల కూడా ఇలాంటి ప్ర‌మాద‌మే పొంచి ఉంద‌ని తాజాగా నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

థియేట‌ర్ వ్య‌వ‌స్థ కుప్ప కూలిపోతే సినిమా ఎక్కడ ఉంటుంది? హీరోల‌కు ఫాలోయింగ్ ఎలా ఉంటుంద‌ని అప్ప‌ట్లో కొంత మంది టాలీవుడ్ నిర్మాత‌లే బాహాటంగా లోతుపాతుల్ని విశ్లేషించారు. కానీ ఇప్పుడు అదే నిర్మాత‌లు ఓటీటీలకు  ప్రాధ‌న్య‌త‌నినిచ్చి.. థియేట‌ర్ల‌ను గాలికి వ‌దిలేసి ప‌బ్లిసిటీతో ప‌నిలేకుండా చేయ‌డం ప్ర‌మాద‌క‌రం అని విశ్లేషిస్తున్నారు. సినిమా కు  రిలీజ్ కు ముందు  ప‌బ్లిసిటీ క‌ల్పిస్తే అది మారు మూల‌ల‌కు మాస్ కి చేరుతుంది. విలేజీ స్థాయిలోనూ మాసెస్ కి ప‌త్రిక‌లు వెబ్ మీడియా స‌హా ఇత‌ర ప్ర‌చార మాధ్య‌మాల ప్ర‌క‌ట‌న‌ల ద్వారా రీచ‌బులిటీ పెరుగుతుంది. ప్ర‌తి విలేజీ నుంచి తెగే టిక్కెట్ల శాతం క‌లిసొస్తేనే సినిమా వ్యాపారానికి మేలు జ‌రుగుతుంది. ఆ ర‌కంగా ప్ర‌చారం కూడా లాభ‌మే.. ఒక టికెట్ తెగే చోట రెండు మూడు టిక్కెట్లు తెగితే సినిమా వ్యాపారం స్పీడ్ వేరేగా ఉంటుంది. ఓటీటీకి కూడా ఇదే వ‌ర్తిస్తుంది. మ‌రి టాలీవుడ్ నిర్మాతలు ఓటీటీల పేరుతో సాంప్ర‌దాయ ప్ర‌చార విధానాన్ని విస్మ‌రించ‌డం ఆపుతారా.. ! భ‌విష్య‌త్ గురించి తెలివిగా ఆలోచిస్తారా లేదా..! అన్న‌ది చూడాలి.
Tags:    

Similar News