విజయ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా?
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? .. చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.;
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? .. చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళనాడులో స్టార్ హీరోగా మంచి క్రేజ్‌తో పాటు కోట్లాది మంది అభిమానగనాన్ని సొంతం చేసుకున్న దళపతి విజయ్ తన సుధీర్ఘ సినీ కెరీర్‌కి గుడ్ బై చెబుతూ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేశాడు విజయ్. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్‌గా అవతరించే ప్రమాదం ఉండటంతో అక్కడి రాజకీయ పార్టీలు విజయ్‌ని ఎలాగైనా తమ దారికి తెచ్చుకోవాలని విశ్వప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాయి. అయితే వారికి ఎలాంటి హామీ ఇవ్వకుండా తెలివిగా అడుగులు వేస్తున్న విజయ్ గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్‌లో రోడ్ షోని నిర్వహించాడు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాలనే ప్లాన్‌లో భాగంగా కరూర్‌లో రోడ్ షో నిర్వహించాడు. అదే ఇప్పుడు విజయ్ మెడకు చుట్టుకుంటోంది.
రోడ్ షో కారణంగా పరిమిత పబ్లిక్‌కే అనుమతి ఉన్నా అక్కడికి విజయ్ వస్తున్నాడని తెలిసి వేల మంది గుమిగూడటంతో భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఊహించిన దానికి మించి క్రౌడ్ రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సీబీఐ ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పటికే హీరో విజయ్‌తో పాటు టీవీకే పార్టీ వర్గాలని, విజయ్ రోడ్ షోకు వినియోగించిన వ్యాన్ డ్రైవర్‌ని సైతం సీబీఐ విచారించింది. ఫస్ట్ విచారణ సమయంలో విజయ్‌ని ఆరు గంటలపాటు విచారించిన సీబీఐ అధికారులు జనవరి 19న మరోసారి విచారణకు పిలవడం తెలిసిందే.
విచారణ కోసం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విజయ్ వెళ్లారు. సోమవారం ఉదయం 10:20 గంటల నుంచి విజయ్‌ని దాదాపు ఐదు గంటల పాటు విచారించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ వర్గాలు విజయ్‌పై పలు ఆసక్తికర ప్రశ్నలు సందించినట్టు సమాచారం. ప్రచారంలో భాగంగా వాహనంలో నిలుచుని మాట్లాడే టప్పుడు రద్దీని గమనించలేదా?..తొక్కిసలాట సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు?..తొక్కిసలాటలోనూ వాహనాన్ని ఎందుకు ముందుకు నడిపారు? జనాన్ని కట్టడి చేయడానికి పార్టీ శ్రేణులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వంటి తదితర ప్రశ్నలని సంధించినట్టుగా తెలిసింది.
అయితే ఇందులో కొన్నింటికి మాత్రమే సమాధానం చెప్పిన విజయ్ మిగతా వాటికి గడువు కోరినట్టుగా చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో విజయ్‌ని సాక్షిగానే పరిగణించిన సీబీఐ ఇప్పుడు మాత్రం దోషిగా భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి రెండవ వారంలో కోర్టుకు సమర్పించబోయే నేరాభియోగ పత్రంలో విజయ్ పేరుని కూడా చేర్చబోతున్నార వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే విజయ్ రాజకీయ జీవితం చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టేనని, రానున్న తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పోటీకి ఇది తీవ్ర అడ్డంకిగా మారే అవకాశం ఉందని తమిళనాట ప్రచారం జరుగుతోంది.