#సామ్ జామ్.. రానా ఎపిసోడ్ కి కంట త‌డి పెట్ట‌నివారుంటారా?

Update: 2020-11-23 05:45 GMT
స‌రిగ్గా కొన్ని నెల‌ల క్రితం లాక్ డౌన్ ముందు యువ‌హీరో రానా అమెరికాలో వైద్య‌ చికిత్స తీసుకున్న సంగ‌తి తెలిసిందే. రానా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నార‌ని దానికి చికిత్స తీసుకునేందుకు అమెరికా వెళ్లార‌ని ర‌క‌ర‌కాల క‌థ‌నాలొచ్చాయి. దానిపై ద‌గ్గుబాటి కుటుంబం వివ‌ర‌ణ ఇవ్వ‌క‌పోవ‌డంతో మీడియాలో క‌న్ఫ్యూజ‌న్ వార్త‌లు ప్ర‌చురితం అయ్యాయి.

అయితే వాట‌న్నిటికీ ఒకే జ‌వాబుతో క్లారిటీ ఇస్తూ కంట త‌డి పెట్టించారు యువ‌హీరో రానా. సామ్ జామ్ కార్య‌క్ర‌మంలో హోస్ట్ స‌హా వీక్ష‌కులంతా కంట‌త‌డి పెట్టారంటే అత‌డి జీవితంలో క‌ష్టం ఎమోష‌న్ ఎంతగా ఉన్నాయో అర్థ‌మ‌వుతోంది. త‌న‌ని తాను హీరోగా ఇంతింతై అన్న చందంగా భ‌ళ్లాల దేవుడిగా ఆవిష్క‌రించుకున్న ది గ్రేట్ రానా జీవితంలో ఇంత క‌ఠోర‌ నిజం దాగి ఉందా? అన్న‌ది ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇటీవ‌లే తాను ప్రేమించిన మిహీక బ‌జాజ్ ని రానా పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ సంతోష క్ష‌ణాన అత‌డు సామ్ జామ్ కార్య‌క్ర‌మంలో త‌న అనారోగ్యంపై ఎన్నో విష‌యాలు వెల్ల‌డించి ఇలా అంద‌రినీ కంట త‌డి పెట్టించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇంత‌కీ త‌న అనారోగ్యం గురించి రానా ఏం చెప్పారు? అంటే..``జీవితం వేగంగా ముందుకెళ్తున్న సమయంలో ఒక చిన్న పాజ్‌ బటన్‌ ... పుట్టినప్పటి నుండే బీపీ.. గుండె సమస్య ఉన్నాయి. నా కిడ్నీలు పాడవుతాయని డాక్టర్లు చెప్పారు. మెదడులో నరాలు చిట్లిపోవడానికి 70 శాతం.. మరణానికి 30 శాతం ఛాన్సుందని డాక్టర్లు చెప్పారు! అంటూ ఎంతో ఎమోష‌న్ కి గుర‌వుతూ రానా కన్నీరు పెట్టుకున్నారు. ఆ దృశ్యం సామ్ స‌హా అంద‌రికీ కంట‌త‌డి పెట్టించింది. కెరీర్ ప‌రంగా చూస్తే రానా చాలా బిజీ. అర‌ణ్య‌-విరాఠ ప‌ర్వం-హిర‌ణ్య క‌సిప ఇలా వ‌రుస‌గా భారీ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా హీరోగా ఎదురేలేని స్థానానికి చేరేందుకు అసాధార‌ణ ప్రణాళిక‌ల‌తో రానా దూసుకుపోతున్నాడు.
Tags:    

Similar News