వాలా-II మంచి సినిమా, కానీ..!

మలయాళం మూవీ 'వాజా 2' ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.;

Update: 2026-04-23 07:05 GMT

మలయాళం మూవీ 'వాజా 2' ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 22 రోజుల్లో ఏకంగా రూ.200+ కోట్ల వసూళ్లు సాధించడం ద్వారా అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన వాజా 2 బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఇప్పుడు ఇతర భాషల ఫిల్మ్‌ మేకర్స్ దృష్టి ఈ సినిమాపై పడింది. ఇప్పటికే పలువురు ఈ సినిమా రీమేక్ రైట్స్‌ కోసం పోటీ పడుతున్నారు. తెలుగులో మాత్రం వాజా 2 సినిమాను డబ్‌ చేసి విడుదల చేయబోతున్నారు. ఏప్రిల్‌ 24న వాజా 2 ను 'వాలా 2' గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు ఈ రోజు మీడియా ప్రీమియర్ షో కూడా వేస్తున్నారు . వాలా 2 సినిమా గురించి తెలుగులో పెద్దగా పబ్లిసిటీ, హంగామా కనిపించడం లేదు. అయితే విడుదలైన తర్వాత జనాల్లోకి ఎక్కుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మలయాళం మూవీ వాజా 2 తెలుగులో...

ఈతరం యూత్‌కి కనెక్ట్‌ అయ్యే పాయింట్‌తో వాజా 2 సినిమాను రూపొందించడం జరిగింది. అందుకే మలయాళంలో సినిమా బ్లాక్ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుని రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. యూత్‌ పై తీస్తే యూనివర్శల్‌ అన్నట్లుగా అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంటుంది. అందుకే తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. అయితే టైటిల్‌ విషయంలో కాస్త క్రియేటివిటీని ఉపయోగించాల్సింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాజా ను వాలా గా మార్చారు. అయితే వాలా అంటే సరైన మీనింగ్‌ లేదు. స్నేహం అనే అర్థం వచ్చే విధంగా పెట్టినట్లు నిర్మాతలు చెబుతున్నప్పటికీ తెలుగులో ముఖ్యంగా ఈతరం జెన్‌ జీ కి ఈ టైటిల్‌ అంతగా అర్థం కాకపోవచ్చు. సోషల్‌ మీడియాలో సినిమాను గురించి చూస్తే తప్ప టైటిల్‌ ఏంటో అర్థం అయ్యేలా లేదు.

వాలా 2 గా రాబోతున్న వాజా 2...

మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వాజా 2 కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మెప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే టైటిల్‌ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉండి, తెలుగు నేటివిటీకి మరింత దగ్గరగా ఉండి ఉంటే బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం. ఈ మధ్య కాలంలో పాన్‌ ఇండియా సినిమాల పేరుతో అన్ని భాషల్లోనూ ఒకటే టైటిల్‌ ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. మలయాళ సినిమా ఇండస్ట్రీ వాళ్లు మాత్రం అలాంటి వాటికి దూరంగా ఉంటారు. తమ సొంత భాషలోనే టైటిల్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. వాటిని తెలుగులో డబ్‌ చేసినప్పుడు ఇక్కడి నిర్మాతలు కిందా మీదా పడాల్సి వస్తుంది. ఆ టైటిల్‌తో ప్రచారం చేశారు కనుక కొత్త టైటిల్‌ ఎందుకు అని చాలా మంది అదే మలయాళ టైటిల్‌ తో తెలుగులోనూ విడుదల చేస్తున్న దాఖలాలు ఈ మధ్య కాలంలో చాలానే చూశాం.

తెలుగు డబ్బింగ్‌ మూవీ...

వాజా 2 కి కాస్త మార్చి వాలా 2 గా ఖరారు చేశారు. మిగిలిన ఫిల్మ్‌ మేకర్స్‌తో పోల్చితే వీళ్లు కాస్త బెటర్‌ అనుకోవాలి. మరీ దారుణంగా అర్థం కాని టైటిల్స్‌తో తెలుగు డబ్బింగ్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకుల మీద రుద్దడం ఈ మధ్య పరిపాటి అయింది. ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని చాలా సినిమాల ఫలితాలు తేల్చాయి. అయినా కూడా ఇటీవల కూడా ఒక మలయాళ టైటిల్‌తో తెలుగు డబ్బింగ్‌ మూవీ వచ్చింది. దాని అర్థం ఏంటో కూడా అర్థం కాని ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉన్నారు. దాంతో తెలుగులో మినిమం వసూళ్లు రాబట్టలేదు. కానీ అక్కడ మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా టైటిల్స్‌ ను లైట్‌ తీసుకుంటే మొత్తానికి మొత్తం నష్టపోవాల్సి వస్తుందని తెలిసినా ఎందుకు అంత అశ్రద్ద... వాజా 2 టైటిల్‌ ను సైతం అచ్చ తెలుగు, సింపుల్‌ పదాన్ని పెట్టి ఉంటే కచ్చితంగా మరో రేంజ్‌ లో సినిమాకు వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉండేది.

Tags:    

Similar News