ఒక్క నిర్ణయం.. ఇద్ద‌రి కెరీర్ల‌ను మార్చేసింది

టాలీవుడ్‌లో ఒక నిర్ణయం ఎంతటి ప్రభావం చూపగలదో చెప్పే ఆసక్తికర ఉదాహరణగా డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్- హీరో రవితేజ కాంబినేషన్ నిలుస్తుంది.;

Update: 2026-04-23 09:30 GMT

టాలీవుడ్‌లో ఒక నిర్ణయం ఎంతటి ప్రభావం చూపగలదో చెప్పే ఆసక్తికర ఉదాహరణగా డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్- హీరో రవితేజ కాంబినేషన్ నిలుస్తుంది. కెరీర్ ప్రారంభంలోనే బద్రి మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న పూరీ, రెండో సినిమా బాచితో డిజాస్ట‌ర్ అందుకుని మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చేశారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం తర్వాతి పరిణామాలను పూర్తిగా మార్చేసింది.

ర‌వితేజ‌తోనే చేస్తా!

ఆ టైమ్ లో పూరి తీయాల‌నుకున్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కోసం నిర్మాతలు మార్కెట్ ఉన్న హీరోనే ఎంపిక చేయాలని ఒత్తిడి తెచ్చార‌ట‌. అయితే, అసిస్టెంట్ డైరెక్టర్ రోజుల్లోనే పరిచయమైన రవితేజపై ఉన్న నమ్మకంతో పూరి తన నిర్ణయాన్ని మార్చుకోలేద‌ని, ఈ సినిమా తీస్తే రవితేజతోనే తీస్తా, లేకపోతే అస్సలు తీయను అన్నట్టుగా ఆయన ఖరాఖండిగా నిల‌బ‌డ‌ట‌మ‌నేది కేవ‌లం కాస్టింగ్ డెసిష‌న్ కాదు, ఒక డైరెక్ట‌ర్ ధైర్యానికి, తన టాలెంట్‌పై ఉన్న విశ్వాసానికి నిదర్శనం.

సింధూరం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ ర‌వితేజ‌

ఈ విషయాన్ని తాజాగా సింగ‌ర్, మ్యూజిక్ డైరెక్ట‌ర్ రఘు కుంచె వెల్లడించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన గేదెల రాజు సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన రఘు, ఆ కాలం నాటి బ్యాక్‌స్టోరీని బయటపెట్టారు. ఆయన మాటల్లో, ఇండస్ట్రీలో టాలెంట్ కంటే మార్కెట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితుల్లో, పూరి తీసుకున్న ఈ రిస్క్ అరుదైనదని చెప్పాలి. పూరీ తీసుకున్న ఆ డెసిష‌న్ వ‌ల్లే అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభమైన ఆయన కెరీర్, చిన్న క్యారెక్ట‌ర్ల‌ నుంచి హీరోగా ఎదగడం వరకు ఎన్నో కష్టాలను చూసింది. ముఖ్యంగా సింధూరం టైమ్ లో ఆయన పెట్టిన శ్రమను రఘు గుర్తు చేశారు. ఫిట్‌నెస్ కోసం పరిగెత్తుతూ తన పాత్ర కోసం ఎంతగా కష్టపడ్డాడో చెప్పుకొచ్చారు. ఆ కష్టానికి సరైన బ్రేక్ మాత్రం ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం రూపంలో వచ్చిందని ర‌ఘు కుంచె తెలిపారు.

ఈ సినిమా హిట్ కావడం పూరికి కమ్‌బ్యాక్ మాత్రమే కాదు, రవితేజకు స్టార్‌డమ్ దిశగా తొలి బలమైన అడుగు. తర్వాత వచ్చిన ఇడియట్ బ్లాక్‌బస్టర్‌తో ఈ కాంబినేషన్ అజేయంగా మారింది. అంటే, ఒక డైరెక్ట‌ర్ తన నిర్ణయంపై నిలబడకపోయి ఉంటే ఈ ఇద్దరి కెరీర్ల దిశ పూర్తిగా మారిపోయేదనే చెప్పాలి. ఇండస్ట్రీలో అవకాశాలు, మార్కెట్ లెక్కల మధ్య నమ్మకం నిలబెట్టుకోవడం అరుదు. కానీ పూరి- రవితేజ ఉదాహరణలో అదే ప్రధాన బలం అయింది. ఒకరికొకరు ఇచ్చుకున్న అవకాశాలు, నమ్మకం.. ఆ ఇద్ద‌రి కెరీర్లను మలిచాయి. పూరి జగన్నాథ్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం, రవితేజను హీరోగా నిలబెట్టడమే కాకుండా, తనకూ మరోసారి నిలదొక్కుకునే అవకాశాన్నిచ్చింది.

Tags:    

Similar News