బాలీవుడ్ ట్రెండ్ తెస్తున్న రాజు

Update: 2017-08-09 16:52 GMT
బాలీవుడ్ లో సినిమాలను ప్రమోట్ చేసే తీరు.. టాలీవుడ్ లో సినిమాలను ప్రమోట్ చేసే తీరు చాలా తేడాగా ఉంటుంది. బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్లు కూడా ముంబయ్ దాటి అనేక ఊళ్ళకు వెళ్ళి సినిమాను ప్రమోట్ చేస్తుంటారు. చండీగర్ నుండి పాట్నా వరకు.. లక్నో నుండి జైపూర్ వరకు.. ఇలా చాలా సిటీస్ లో షారూఖ్ నుండి అమీర్ ఖాన్ వరకు.. హృతిక్ రోషన్ నుండి రణవీర్ సింగ్ వరకు తమ సినిమాలను ప్రమోట్ చేస్తారు. అదే మన తెలుగు స్టార్ హీరోలైతే.. కేవలం హైద్రాబాద్లో ఒక హోటల్లో ఒక రోజంతా ఇంటర్యూలకు పిలిచి.. అన్ని ఛానల్లనూ పిలిచి అక్కడే వీడియో బైట్లు ఇచ్చేస్తారు. కావాలంటే హైదరాబాద్ లోనే ప్రెస్ మీట్లు పెడుతుంటారు.

అయితే బాలీవుడ్లో పనిచేసొచ్చి.. మన బాహుబలిని అక్కడ అమ్మేసిన రానా దగ్గుబాటి ఉన్నాడు చూడండి.. ఇప్పుడు బాలీవుడ్ కల్చర్ ను ఇక్కడ కూడా ప్రమోట్ చేస్తున్నాడు. తన కొత్త సినిమా నేనే రాజు నేనే మంత్రి కోసం ఈరోజు విజయవాడలోని కెఎల్ యునివర్సిటీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అలా ఒక యునివర్సిటీకి సాధారణంగా మన స్టార్లు ఏదన్నా ఈవెంట్ కు చీఫ్‌ గెస్టుగా వెళతారు తప్పిస్తే.. ఇలా సినిమాను ప్రమోట్ చేయడానికి వెళ్లరు. కాని రానా మాత్రం కాలేజీల నుండి బిగ్ బాస్ వరకు.. అంతా కూడా బాలీవుడ్ తరహాలోనే సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఒకవేళ ఇతగాడి ప్రమోషన్ ప్లానింగ్ సక్సెస్ అయ్యి సినిమాకు ప్లస్సయ్యిందంటే.. అప్పుడు ఇతర హీరోలు కూడా రానా టెక్నిక్ వాడుకుంటారేమో చూడాలి.

నిజానికి మన తెలుగు సినిమా ఏరియా చాలా చిన్నది అంటూ మన హీరోలు హైదరాబాదులో కూర్చుని కాకమ్మ కథలు చెబుతుంటారు కాని.. బాలీవుడ్ లో 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలకంటే మన సినిమాలకు నెట్ వసూళ్ళు ఎక్కువగా వస్తున్నాయి. యావరేజ్ టాక్ వచ్చిన డిజె దువ్వాడజగన్నాథమ్ సినిమాకు 120+ కోట్లు నెట్ వచ్చిందంటే మన బాక్సాఫీస్ కెపాసిటీ చూడండి. హిందీవాళ్లకు దాదాపు ఎనిమిది రాష్ట్రాలు ఇచ్చిన బలం మనకు కేవలం రెండు రాష్ట్రాల్లోనే ఉంది. సరిగ్గా వాడుకోండి బాస్.
Tags:    

Similar News