రామోజీ ఈజ్ బ్యాక్?

Update: 2018-05-19 15:30 GMT
తెలుగు సినిమా గర్వించదగ్గ నిర్మాతల్లో రామోజీ రావు ఒకరు. ఏకంగా 80 సినిమాల దాకా నిర్మించిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఒకప్పుడు ఆ బేనర్ నుంచి వరుస బెట్టి సినిమాలు వచ్చేవి. కానీ రామోజీ రావుకు వయసయ్యే కొద్దీ ఆయన బేనర్లో సినిమాలు తగ్గిపోయాయి. ఒక దశలో బాగా గ్యాప్ కూడా వచ్చేసింది. ఐతే మళ్లీ ‘చిత్రం’.. ‘నువ్వే కావాలి’.. ‘ఆనందం’ లాంటి చిన్న సినిమాలతో రామోజీ సంస్థ ‘ఉషా కిరణ్ మూవీస్’ పుంజుకుంది. వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేసింది. కానీ తర్వాత వరుస ఫ్లాపులు ఎదురవడంతో నెమ్మదించింది. చివరగా ‘దాగుడు మూతల దండాకోర్’ అనే సినిమా వచ్చింది రామోజీ బేనర్ నుంచి. ఆ సినిమా ఫ్లాపవడంతో మళ్లీ సినిమాల జోలికి వెళ్లలేదు. రామోజీ దగ్గరున్న క్రియేటివ్ టీం బాగా వీక్ అయిపోవడంతో సినిమాల నిర్మాణం జోలికి వెళ్లకుండా ఆగిపోయారు. ఇక ఆ బేనర్ దాదాపుగా మూత పడినట్లే అనుకున్నారంతా.

కానీ రామోజీ మళ్లీ తెలుగు సినిమాలపై తనదైన ముద్ర వేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందులాగా చిన్న సినిమాలు కాకుండా భారీ ప్రయత్నాలే చేయాలని ఆయన ఫిక్సయ్యారట. టాలీవుడ్లో టాప్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్లోనే సినిమాలు చేయాలని ఆయన భావిస్తున్నారట. ఇందుకోసం సన్నాహాలు కూడా చకచకా జరుగుతున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ దర్శకుడితో ఓ భారీ చిత్రాన్ని అనౌన్స్ చేయబోతున్నారట త్వరలో. దీంతో పాటుగా మరో హై బడ్జెట్ మూవీ కూడా తీస్తారట. ఈ సినిమాలకు ఫైనాన్స్ సమకూర్చి.. షూటింగ్ మొత్తం ఎప్పట్లాగే రామోజీ ఫిలిం సిటీలోనే చేయిస్తారట. 80 ఏళ్ల పైబడ్డ రామోజీ.. జీవిత చరమాంకంలో మళ్లీ ఇలా సినిమాల్లోకి దిగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. మరోవైపు ఆయన ‘ఈటీవీ భారత్’ పేరుతో దేశవ్యాప్తంగా అన్ని భాషలకూ కలిపి డిజిటల్ మీడియాతో త్వరలోనే రాబోతుండటం విశేషం.

Tags:    

Similar News