కరోనా లౌకికవాద వైరస్..దానికి కులం మతం తెలియదు

Update: 2020-04-05 15:30 GMT
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీఖన్నా.. జై లవకుశ - తొలిప్రేమ - జిల్ - శివమ్ - బెంగాల్ టైగర్ - సుప్రీమ్ - హైపర్ - రాజా ది గ్రేట్ - టచ్ చేసి చూడు - శ్రీనివాస కళ్యాణం సినిమాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇటీవల నటించిన 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండతో నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాతో ఓ భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది రాశీ. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ కి సినిమాలతోనే కాకుండా ఇంస్టాగ్రామ్ - ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ సామాజిక అంశాలపై తనదైన శైలిలో ఎప్పటికప్పుడూ స్పందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో ఇంటికే పరిమితమైన రాశీఖన్నా కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ట్వీట్స్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా దేశంలో కరోనా వ్యాపిస్తున్న తీరు - తాజా పరిణామాలపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ లో '99.99 శాతం మంది హిందువులు గోమూత్రం తాగరని - గోమూత్రం కరోనా వైరస్ ను ఎదుర్కొంటుందని అసలు నమ్మరని తెలిపారు. అదేవిధంగా, 99.99 శాతం ముస్లింలు తబ్లిగీ జమాత్ ఈవెంట్ కు మద్దతు ఇవ్వరని - జమాత్ అధిపతి మౌలానా సాద్ ఈ కార్యక్రమంలో చెప్పిన మాటలను అంతకన్నా విశ్వసించబోరని' అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా 'కొవిడ్-19 పూర్తిగా లౌకికవాద వైరస్. మతాల ఆధారంగా అది ప్రజలపై వివక్ష ప్రదర్శించదు. అందరిపట్ల సమభావం ప్రదర్శిస్తుంది. తనను తాకిన ప్రతివాళ్లను బాధించడమో - చంపడమో చేస్తుంది. ఈ క్రమంలో వర్గం - కులం - సంపద - మతం అనే అంశాలను ఏమాత్రం పట్టించుకోదు. ఇప్పటికైనా కరోనా వ్యాప్తికి ఒకరిని నిందించడం మానేద్దాం. కరోనాపై కలసికట్టుగా పోరాడుదాం' అంటూ రాశీ పిలుపునిచ్చారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత మెచ్యూర్ గా ఆలోచించినందుకు పలువురు మెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News