ప్రభాస్ నాశనం చేసేస్తున్నాడన్న భాగ్యశ్రీ

Update: 2021-07-02 02:30 GMT
ప్రభాస్ గురించి చాలా మంది చేసే కంప్లైంట్ అతను తిండి పెట్టి చంపేస్తాడని. హైదరాబాద్‌లో ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతోందంటే.. యూనిట్లో ముఖ్యమైన నటీనటులు, టెక్నీషియన్లందరికీ ప్రభాస్ ఇంటి నుంచి క్యారియర్లు వెళ్తుంటాయని.. రకరకాల వంటకాలు తయారు చేయించి తీసుకొచ్చి అందరికీ కొసరి కొసరి వడ్డిస్తుంటాడని చెబుతుంటారు. ఓ సందర్భంలో రాజమౌళి సైతం ప్రభాస్ ఇచ్చే విందులెలా ఉంటాయో చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ ఇంటికి ఎవరైనా వెళ్లారంటే విందులు మరో స్థాయిలో ఉంటాయని.. భుక్తాయాసంతో బయటికి రాక తప్పదని చెబుతుంటారు. కేవలం భోజనాలు పెట్టించడంతో సరిపెట్టకుండా.. తన సహచర ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఫుడ్ గిఫ్ట్స్ ఇవ్వడం కూడా ప్రభాస్‌కు అలవాటే. తన సొంతూరు భీమవరం నుంచి మంచి మంచి స్వీట్లు తెప్పించి బహుమతిగా అందిస్తుంటాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్‌తో 'రాధేశ్యామ్'లో నటిస్తున్న బాలీవుడ్ నటి భాగ్యశ్రీకి కూడా ప్రభాస్ నుంచి ఇలాంటి అనుభవమే ఎదురైందిప్పుడు. ఆమెకు తన ప్రాంతం నుంచి రుచికరమైన పూత రేకులు తెప్పించి ఇచ్చాడు ప్రభాస్. ఇప్పటికే ఆంధ్రా ఫేమస్ పూత రేకులను ఆమెకు రుచి చూపించిన ప్రభాస్.. తాజాగా 'రాధేశ్యామ్' కొత్త షెడ్యూల్ మొదలైన నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌కు వచ్చిన భాగ్యశ్రీకి మరోసారి పూత రేకుల బహుమతి అందించాడు. ఆమె ఆ స్వీట్ బాక్సులను ట్విట్టర్లో షేర్ చేసింది. హైదరాబాద్ నుంచి ఈ స్వీట్లు ప్రభాస్ నుంచి తనకు అందాయని, అవెంతో రుచికరంగా ఉన్నాయని చెప్పింది భాగ్యశ్రీ. అంతే కాక.. ప్రభాస్ తనను నాశనం చేసేస్తున్నాడని (he spoils me) ఆమె వ్యాఖ్యానించింది. 50వ పడికి చేరువ అవుతున్నప్పటికీ ఇంకా మంచి ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న భాగ్యశ్రీ ప్రభాస్ ఇచ్చే స్వీట్లకు అలవాటు పడి ఫిట్నెస్ కోల్పోతానేమో అన్న భయంతో సరదాగా ఈ వ్యాఖ్య చేసినట్లుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ.. ప్రభాస్‌కు తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి కొన్ని రోజుల్లోనే 'రాధేశ్యామ్' చిత్రీకరణ పూర్తి కాబోతోంది.
Tags:    

Similar News