దర్శకుడు (X) నిర్మాత: కోర్టులో 84 కోట్ల దావా.. ఎవరు క్రియేటరో తేలేదెలా?
ధనుష్ నటించిన `తేరే ఇష్క్ మే` తాజాగా చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
ధనుష్ నటించిన `తేరే ఇష్క్ మే` తాజాగా చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆనంద్ ఎల్ రాయ్ మరోసారి ఎమోషనల్ రొమాంటిక్ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించాడని ప్రశంసలు కురిసాయి. కొన్నేళ్ల క్రితం ఇదే జోడీ నుంచి వచ్చిన `రాంజానా` కథతో ఉన్న కనెక్షన్ తాజా వివాదానికి దారి తీసింది.
అప్పట్లో ధనుష్ - ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఆనంద్ ఎల్. రాయ్ కి చెందిన కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ తో కలిసి `రాంజానా` చిత్రాన్ని నిర్మించింది. దీంతో ఈరోస్ సంస్థ `తేరే ఇష్క్ మే` చిత్రాన్ని `ఆధ్యాత్మిక సీక్వెల్` అని అభివర్ణిస్తూ, ఆనంద్ ఎల్ రాయ్‌పై రూ.84 కోట్ల నష్టపరిహారం కోరుతూ బాంబే హైకోర్టులో దావా వేసింది.
ఈరోస్ సంస్థ ప్రకారం.. `తేరే ఇష్క్ మేన్` చిత్రాన్ని ప్రమోట్ చేసే సమయంలో మేకర్స్ అనుమతి లేకుండా `రాంజానా` బ్రాండ్‌ను వాడుకున్నారు. సినిమా టీజర్‌లో ``రాంజానా ప్రపంచం నుండి`` అనే వాక్యాన్ని వాడటంపై ఈరోస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాను `రాంజానా`కు ఒక `స్పిరిచువల్ సీక్వెల్` (ఆధ్యాత్మిక కొనసాగింపు) గా చిత్రీకరించడం ద్వారా దాని క్రేజ్‌ను అన్యాయంగా వాడుకున్నారని ఈరోస్ వాదిస్తోంది.
ఈరోస్ తన పిటిషన్‌లో కొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. రాంజానాలో హీరో పాత్ర పేరు కుందన్ శంకర్. `తేరే ఇష్క్ మేన్`లో ధనుష్ పాత్ర పేరు శంకర్. ఈ రెండు పాత్రల స్వభావం, భావోద్వేగాలు ఒకేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. రాంజానాలో మురారి పాత్ర పోషించిన మహమ్మద్ జీషాన్ అయ్యూబ్, ఈ కొత్త సినిమాలో కూడా అదే పేరుతో (మురారి) కనిపించడం కాపీరైట్ ఉల్లంఘనే అని పేర్కొన్నారు.
రాంజానా సినిమా ఐపీని కాపీ చేసారని, సంబంధిత ట్రేడ్‌మార్క్ పాత్రలు, డైలాగులు, సీక్వెల్ లేదా రీమేక్ హక్కులన్నీ తమకే చెందుతాయని ఈరోస్ వాదిస్తోంది. అనుమతి లేకుండా ఈ హక్కులను వాడుకోవడం వల్ల తమకు భారీ నష్టం వాటిల్లిందని, అందుకే `తేరే ఇష్క్ మే` నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ రూ.84 కోట్లు చెల్లించాలని వారు కోర్టును ఆశ్రయించారు.
నిజానికి ఈ వివాదం ఇప్పుడే మొదలైనది కాదు. కొంతకాలంగా ఇరు వర్గాల నడుమ వార్ నడుస్తోంది. గత ఏడాది ఆగస్టులో రాంజానా తమిళ వెర్షన్‌ను ఈరోస్ సంస్థ AI (కృత్రిమ మేథస్సు) సాయంతో కొత్త ముగింపుతో రీ-రిలీజ్ చేసింది. దీనిపై దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన అనుమతి లేకుండా ఇలా చేయడం కళాత్మక స్వేచ్ఛను దెబ్బతీయడమే అని విమర్శించారు. దానికి కౌంటర్‌గా ఈరోస్ ఇప్పుడు ఈ భారీ దావా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసులో ఆనంద్ ఎల్ రాయ్‌తో పాటు టి-సిరీస్, నెట్‌ఫ్లిక్స్, రచయిత హిమాన్షు శర్మలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఈ కేసులో కోర్టు తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉంటుందో వేచి చూడాలి.