రిజ‌ల్ట్ కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే!

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఒకే మార్గాన్ని ఎంచుకుంటారు అనుకోవడం తప్పు.;

Update: 2026-03-06 17:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలందరూ ఒకే మార్గాన్ని ఎంచుకుంటారు అనుకోవడం తప్పు. కొందరు సేఫ్ గేమ్ ఆడుతుంటే, మరికొందరు మాత్రం రిస్క్ తీసుకుని తమకంటూ ప్రత్యేక దారిని వెతుక్కుంటారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రానా ద‌గ్గుబాటి. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, కొత్త ఆలోచనలతో ముందుకు సాగే వ్యక్తిగా రానా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ప్ర‌ముఖ నిర్మాత రామానాయుడు మనవడిగా, సురేష్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రానా, తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచే కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగారు. ముఖ్యంగా బాహుబ‌లి ఫ్రాంచైజ్ సినిమాల్లో చేసిన భల్లాలదేవ పాత్ర అతనికి పాన్ ఇండియా స్థాయిలో అపారమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.

సినిమాలు చేస్తూనే నిర్మాణంలోనూ..

ఆ తర్వాత కూడా రానా తన ప్రయాణాన్ని ఒకే విధంగా కొనసాగించలేదు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు, విలన్ పాత్రలు కూడా స్వీకరిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇది చాలా మంది హీరోలు తీసుకోని రిస్క్. కానీ రానా మాత్రం పాత్ర బలమే ముఖ్యమని నమ్ముతూ తన ఎంపికల్లో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా రానా ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో పలు ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు. అతను నిర్మించిన సినిమాలు ఎక్కువగా కథా ప్రాధాన్యత కలిగినవే కావడం విశేషం. ఈ నేపథ్యంలో రానా తాజాగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఫ్యామిలీ డ్రామాల‌కు ఆద‌ర‌ణ ఎక్కువ‌

ఇండియాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుందని రానా అభిప్రాయపడ్డారు. అందుకే సంక్రాంతి సీజన్‌లో ఎన్ని ఫ్యామిలీ డ్రామాలు వచ్చినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారని చెప్పారు. అయితే అదే సమయంలో కొత్త కథలు, కొత్త ఆలోచనలు కూడా ప్రేక్షకులు కోరుకుంటున్నారని రానా స్పష్టం చేశారు. మంచి కథలను వెతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడ‌మే త‌న టార్గెట్ అని కూడా రానా పేర్కొన్నారు.

టెక్నాల‌జీ పై ఆస‌క్తి ఎక్కువ‌

ప్రయోగాత్మక సినిమాల గురించి కూడా రానా ఆసక్తికరంగా స్పందించారు. అలాంటి సినిమాలు ఒక్కరి వల్ల రావని, చాలా మంది కలిసి పనిచేసినప్పుడే అవి సాధ్యమవుతాయని చెప్పారు. టెక్నాలజీపై కూడా తనకు ఎక్కువ ఆసక్తి ఉందని, యాక్టింగ్ వైపు వ‌చ్చిన‌ప్ప‌టికీ టెక్నాల‌జీ ప‌రంగా తాను కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటానని తెలిపారు.

వెనుక‌డుగు వేయ‌కూడ‌దు

అయితే రానా చెప్పిన మ‌రో ముఖ్యమైన విషయమేంటంటే, జీవితంలో లేదా కెరీర్‌లో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని, మనకు ఏ విషయంలో ఆసక్తి ఉంటే దానిలో వెనక్కి తగ్గకూడదని, రిస్క్ తీసుకున్నప్పుడే రిజ‌ల్ట్ వస్తుందని ఆయన అన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అనుకున్న‌ది సాధించే వర‌కు పోరాడుతూనే ఉండాలని రానా చెప్పిన మాటలు ఇప్పుడు యూత్ కు పెద్ద మెసేజ్ లా మారాయి. సినిమా రంగంలోనే కాకుండా ఏ రంగంలో అయినా విజయాన్ని సాధించాలంటే ధైర్యం, పట్టుదలతో పాటు రిస్క్ తీసుకునే ధోరణి కూడా అవసరమని రానా మాట‌లు మరోసారి గుర్తు చేస్తున్నాయి.

Tags:    

Similar News