RTC x రోడ్స్‌లో `ది ప్యారడైజ్` ప్రీమియర్ షో కోసం CM రేవంత్‌కి నాని విజ్ఞప్తి
నేచురల్ స్టార్ నాని తన జీవితంలో అత్యంత ఉత్కంఠతో కూడిన క్షణాలను ఎదుర్కొంటున్నాడు. `ది ప్యారడైజ్` మొదటి షో నుంచి టాక్ ఎలా ఉంటుందో వినాలనే ఆత్రుతతో ఉన్నారు.
నేచురల్ స్టార్ నాని తన జీవితంలో అత్యంత ఉత్కంఠతో కూడిన క్షణాలను ఎదుర్కొంటున్నాడు. `ది ప్యారడైజ్` మొదటి షో నుంచి టాక్ ఎలా ఉంటుందో వినాలనే ఆత్రుతతో ఉన్నారు. ఇలాంటి సమయంలో నాయకులు, అధికారులకు అతడి విజ్ఞప్తి ఇప్పుడు చర్చగా మారింది. నాని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి- తెలంగాణ పోలీసు అధికారులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. చిన్నతనం నుంచే సినిమాను ఎంతో ఆస్వాధించిన ఒక నిజమైన సినిమా అభిమానిగా తాను ఈ అభ్యర్థన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సినిమా అంటే తనకెప్పుడూ ఇష్టమని.. తనకు ఇష్టమైన ఆ అనుభూతిని హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని థియేటర్లలో అనుభవించడం ప్రత్యేకమని నాని తెలిపారు. ఎవరికోసమైతే సినిమా తీస్తామో.. ఆ ప్రేక్షకుల మధ్యనే కూర్చుని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటమే అసలైన సంతృప్తి అని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23న జరగనున్న `ది ప్యారడైజ్` సినిమా ప్రీమియర్ షోను ఆర్టీసీ ఎక్స్ రోడ్స్‌లోని థియేటర్‌లో వీక్షించేందుకు అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా అన్ని అవసరమైన భద్రతా మార్గదర్శకాలను- ప్రోటోకాల్‌లను తాము కచ్ఛితంగా పాటిస్తామని... భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. తన ఈ విజ్ఞప్తిని దయచేసి పరిశీలించాలని నానీ వినమ్రంగా కోరారు.
నిజానికి ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లోని సంథ్య థియేటర్ లో అల్లు అర్జున్ `పుష్ప` షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట రభస.. అనంతర పరిణామాలను దృష్టిలో ఉంచుకునే నాని మరీ ఇంత ఎమోషనల్ గా ఈ సోషల్ మీడియా లేఖ రాసారని అర్థం చేసుకోవచ్చు. జరగకూడనిది ఏదైనా జరిగితే అనే భయం ఇంకా పోలీసులకు, నాయకులకు కూడా ఉంది. అందుకే సంథ్య థియేటర్ ఘటన తర్వాత ఎక్స్ రోడ్స్ లో హీరోల సమక్షంలో జరిగే ప్రీమియర్ షోలకు అనుమతించడం లేదు. కానీ నాని అభ్యర్థన కూడా న్యాయంగా కనిపిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్లతో ప్రజల అనుబంధం వేరు. దానిని నాని అభ్యర్థనలో చూడొచ్చు.
అయితే నాని విన్నపాన్ని, అభ్యర్థనను పరిశీలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా లేదా? అన్నది వేచి చూడాలి. సీఎం నుంచి అనుమతి లభిస్తే పోలీసులు తమ ఏర్పాట్లలో ఉంటారు. ఈనెల 24న ది ప్యారడైజ్ తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా విడుదలవుతోంది. నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో ఇది సంచలనం సృష్టించబోతోందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. నేచురల్ స్టార్ నాని కోసం ఇప్పటికే ఏపీ, తెలంగాణలో మొదటి వారం టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.