తెలుగు సినిమా తెర వెనుక 'స్టోరీబోర్డ్' హీరోలు!

టాలీవుడ్ మేకింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఒక సినిమా వెండితెరపై సంచలనం సృష్టించడానికి ముందే ఆ కథలో ప్రతీ సన్నివేశం కాగితంపై ఉంటుంది

Update: 2026-09-22 17:05 GMT

టాలీవుడ్ మేకింగ్ పరంగా అంతర్జాతీయ స్థాయి వైపు వేగంగా అడుగులు వేస్తోంది. అయితే ఒక సినిమా వెండితెరపై సంచలనం సృష్టించడానికి ముందే ఆ కథలో ప్రతీ సన్నివేశం కాగితంపై ఉంటుంది. దర్శకుడి ఆలోచనలకు, రచయితల ఊహలకు తొలి దృశ్యరూపం ఇచ్చేది స్టోరీబోర్డ్ ఆర్టిస్టులు. కెమెరా రోల్ కావడానికి ముందే సినిమాలోని సినిమాటోగ్రఫీ, యాక్షన్ రంగాలు, విజువల్ ఎఫెక్ట్స్ , ప్రొడక్షన్ డిజైన్‌లకు స్పష్టమైన బ్లూప్రింట్‌ను సిద్ధం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. తెర వెనుక తెరపై కనిపించే అద్భుత దృశ్యాలకు పునాది వేసే టాలీవుడ్ స్టోరీబోర్డ్ కళాకారుల అంతరంగంపై ప్రత్యేక కథనం ఇది.

స్టోరీబోర్డ్ అనేది కొన్ని గీతలు గీయడం మాత్రమే కాదు. దర్శకుని విజన్‌ను చిత్ర బృందానికి స్పష్టంగా వివరించే సమాచార వారధిలా పని చేస్తుంది. `మిరాయ్`, `ఈనే రిపీట్` వంటి చిత్రాలకు పనిచేసిన వీర వెంకట సిద్ధార్థ రాయ్ ప్రకారం స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్‌కు దర్శకత్వ విభాగంపై కూడా అవగాహన ఉండటం అవసరం. ఇది షాట్ సెలెక్షన్, పేసింగ్, స్టాజింగ్ వంటి విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

అలాగే `పుష్ప 2`, `కుబేరా`, `కీడా కోలా` చిత్రాల స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్ లక్ష్మీ భరణి పారిమి ఏమ‌న్నాన‌రంటే? దర్శకుల విజన్‌ను ప్రొడ్యూసర్లు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్లు , ఇతర విభాగాలకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి స్టోరీబోర్డ్ అద్భుతమైన విజువల్ టూల్‌గా ఉపయోగపడుతుంద‌న్నారు.

సినిమాల్లో విజువల్ ఎఫెక్ట్స్, కార్ ఛేజింగ్‌లు, భారీ పేలుళ్ల సిజి ఎన్విరాన్‌మెంట్లు ఉన్నప్పుడు స్టోరీబోర్డింగ్ ప్రాముఖ్యత మరీ ముఖ్యం. `మిరాయ్` చిత్రంలో విఎఫ్‌ఎక్స్ ద్వారా రూపొందించిన `సంపాతి పక్షి` సీక్వెన్స్ కోసం సిద్ధార్థ రాయ్ ఐస్-కేవ్ సెట్‌ను సందర్శించి ఏడాదిన్నర పాటు ప్రణాళికలు రచించారు. పక్షి కదలికలు, నటులతో దాని ఇంటరాక్షన్ ఎలా ఉండాలో ముందే కాగితంపై కొరియోగ్రఫీ చేయడం వల్ల షూటింగ్ సమయంలో ప్రత్యక్ష నటులు , సిజిఐ క్యారెక్టర్ మధ్య బంధాన్ని చిత్రీకరించడం సులువైంది.

చాలామంది స్టోరీబోర్డింగ్ అనగానే కొన్ని క్షణాల్లో రఫ్ స్కెచ్‌లు గీసేయవచ్చు కదా? అని తేలికగా భావిస్తుంటారు. కానీ `కోరియన్ కనకరాజు`, `ఘాటీ` చిత్రాలకు పనిచేసిన రుద్ర ఉమ్మిడి ఈ అపోహను ఖండించారు. `ప్రతీ ఫ్రేమ్ వెనుక ఎంతో ప్రణాళిక, కంపోజిషన్, విజువల్ థింకింగ్ ఉంటాయి` అని స్పష్టం చేశారు. అలాగే కాగితంపై అనుకున్న దృశ్యం లొకేషన్ పరిమితులు లేదా భద్రతా కారణాల వల్ల సెట్‌లోకి వెళ్లాక మారే అవకాశం ఉంది. `ఘాటీ` సినిమాలో ఒక క్యారెక్టర్ గాల్లో బైక్ పైకి దూకే సీన్ కాగితంపై అద్భుతంగా అనిపించినా? షూటింగ్ సమయంలో ప్రాక్టికల్ సవాళ్ల వల్ల అమలులో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు.

ప్రస్తుత రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి రావడంతో స్టోరీబోర్డ్ ఆర్టిస్టుల పనితీరులోనూ మార్పులు వస్తున్నాయి. `తండేల్`, `వీరభద్రుడు`, `మహావీరుడు` వంటి చిత్రాలకు పనిచేసిన చంద్రన్ వంటి కళాకారులు ఏఐ ని పనిని వేగవంతం చేయడానికి, రిఫరెన్సులు సేకరించడానికి స్కెచ్‌లకు డీటెయిలింగ్ జోడించడానికి తోడ్పాటుగా ఉపయోగిస్తున్నారు. అయితే ఏఐ ఎంత పెరిగినా? మానవ సృజనాత్మకతను, దర్శకుని భావోద్వేగాలను పూర్తిగా భర్తీ చేయలేదని చెబుతున్నారు. క్లోజప్, మిడ్ లేదా వైడ్ షాట్ ఎంపికలు సీన్‌లో ఉండాల్సిన ఎమోషన్‌ను అర్థం చేసుకోవడం సినిమా పరిజ్ఞానం ఉన్న కళాకారుడికే సాధ్యమవుతుంది.

చివ‌రిగా తెలుగు సినిమా పరిధి పెరిగి అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్న‌ తరుణంలో స్టోరీబోర్డ్ ఆర్టిస్టుల ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రొడక్షన్ ఖర్చులను తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం , స‌న్నివేశాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడంలో వీరంతా నిశ్శబ్దంగా త‌మ వంతు పాత్ర పోషిస్తున్నారు. తెర వెనుక సినిమా విజయంలో కీలక భాగస్వాములవుతున్న కళాకారుల నైపుణ్యం భ‌విష్య‌త్ లో టాలీవుడ్ మేకింగ్ ప్రమాణాలను మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయం.

Tags:    

Similar News