సంస్కృతి అంటే మహిళల దుస్తులేనా?
దుస్తుల విషయంలో ఎదురైన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఆగ్రహ వ్యక్తం చేసారు.
దుస్తుల విషయంలో ఎదురైన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి ఆగ్రహ వ్యక్తం చేసారు. తిరువనంతపురంలో జరిగిన ఓ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సందర్భంగా ఐశ్వర్య వేసుకున్న డ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అయితే ఈ వివాదంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఘాటుగా స్పందించారు. అసలు సమస్య తన దుస్తుల్లో లేదని.. అక్కడి వాతావరణం , ఫొటోగ్రాఫర్ల ప్రవర్తన వల్లనే తనకు ఇబ్బంది కలిగిందని మండి పడ్డారు. ఫొటోగ్రాఫర్లు తన ముఖంపై కాకుండా అసౌకర్యంగా భావించే కోణాల నుంచి ఫొటోలు తీయడంపై అసహనం వ్యక్తం చేశారు.
`కెమెరాలు నా ముఖం వైపు కాకుండా ఇతర కోణాల్లో పెట్టారు. దీంతో తీవ్ర అస్వస్థత కలిగింది. ఒక వ్యక్తికి ఇబ్బందిగా అనిపించినప్పుడు హావభావాలు, శరీర భాష సహజంగానే మారుతాయన్నారు. అక్కడ వ్యక్తిగత సరిహద్దులను ఉల్లంఘించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలకు ఐశ్వర్య లక్ష్మి ధీటైన సమాధానమిచ్చారు. `ఇబ్బందిగా అనిపిస్తే అంతటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి? అని ప్రశ్నించిన నెటిజన్లను ఉద్దేశించి స్పందించారు.
`సంస్కృతి అనేది మహిళ ధరించే బట్టలు లేదా డ్రెస్ పొడవులోనే ఉందా? సమాజంలో మనం నడుచుకునే తీరు, ప్రవర్తించే విధానంలో సంస్కృతి ఉండదా? అని నిలదీశారు. మహిళల దుస్తులపై సులభంగా కామెంట్లు చేసే సమాజం, ఇతరుల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని మాత్రం ఎందుకు? ప్రశ్నించదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విమర్శలు మొదలైన 24 గంటల్లో నవ్వి ఊరుకున్నానని కానీ రోజులు గడుస్తున్నకొద్దీ దీనిపై చర్చ తీవ్రరూపం దాల్చడం ఆశ్చర్యపరిచిందన్నారు. దేశంలో జీడీపీ వృద్ది .. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అనాథలుగా వదిలేస్తున్న సామాజిక అంశాల గురించి మాట్లాడటానికి ఎవరికీ సమయం ఉండదని.. కానీ మహిళ దుస్తుల గురించి మాట్లాడటానికి మాత్రం అందరికీ సమయం దొరుకుతుందంటూ సమాజంలోని ద్వంద్వ ప్రమాణాలను తప్పుపట్టారు. దుస్తుల కంటే ప్రవర్తనా నియమావళే అసలైన సంస్కృతి అని ఆమె నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లోనూ సరికొత్త చర్చకు దారితీశాయి. బహిరంగ ప్రదేశాల్లో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, ఫొటోగ్రాఫర్ల పరిమితులు , సాంప్రదాయం పేరుతో మహిళలపై విధించే ఆంక్షలపై స్పష్టమైన అవగాహన రావాల్సిన అవసరం ఉందన్న అంశంపై చర్చ మొదలైంది.
ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి వరుస విజయాలతో సినిమాలో బిజీ నటిగా కొనసాగుతున్నారు. తమిళంలో విష్ణు విశాల్‌తో కలిసి నటించిన `గట్ట కుస్తీ 2` భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, మలయాళంలో నటించిన `ఆశ` చిత్రం కూడా మంచి విజయం సాధించింది.