వైరల్ అవార్డ్ రీల్ కు లైక్.. యామీ క్లారిటీ ఇదిగో..
బాలీవుడ్ లో అవార్డులపై చర్చలు కొత్తేం కావు. అయితే తాజాగా హీరోయిన్లు యామీ గౌతమ్, కృతి సనన్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి.;
బాలీవుడ్ లో అవార్డులపై చర్చలు కొత్తేం కావు. అయితే తాజాగా హీరోయిన్లు యామీ గౌతమ్, కృతి సనన్ పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఓ వైరల్ రీల్ కు యామీ గౌతమ్ లైక్ చేయడం చుట్టూ వివాదం చెలరేగగా.. దీనిపై ఆమె రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి వివాదాల్లో కూడా ఉండాలనుకోవడం లేదని, అది పూర్తిగా అనుకోకుండా జరిగిన విషయమని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన జీ సినీ అవార్డ్స్ కార్యక్రమంలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు నటి కృతి సనన్ కు లభించింది. ఆమె నటించిన తేరే ఇష్క్ మేన్ చిత్రానికి ఆ అవార్డు దక్కింది. దీంతో కృతి అవార్డు అందుకుంటున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే సమయంలో మరో వీడియోలో యామీ గౌతమ్ గతంలో అవార్డుల గురించి చేసిన వ్యాఖ్యలను యాడ్ చేసి ఓ నెటిజన్ రీల్ రూపొందించారు.
ఆ వీడియోలో యామీ నటించిన హక్ సినిమాలోని ఆమె యాక్టింగ్ కు కృతి నటనతో పోల్చుతూ.. నిజంగా ఎవరు అవార్డుకు అర్హులన్న చర్చను ప్రస్తావించారు. ఆ రీల్ లో యామీ నటన మరింత మెరుగ్గా ఉందని కొందరు అభిమానులు కామెంట్స్ చేయగా.. అది పెద్ద చర్చకు దారి తీసింది. ఆ తర్వాత ఆ రీల్ కు యామీ గౌతమ్ లైక్ చేసినట్లు కనిపించింది.
దీంతో ఆమె కూడా ఆ కంపారిజన్ కు మద్దతు ఇచ్చినట్లుగా నెటిజన్లు భావించారు. కొంతమంది అయితే ఇది కృతిని విమర్శించే లైక్ గా అభిప్రాయపడ్డారు. అయితే ఆ వివాదం పెరగడంతో యామీ గౌతమ్ ఇప్పుడు స్వయంగా స్పందించారు. తాను ఆ వీడియోను కావాలనే లైక్ చేయలేదని తెలిపారు. ప్రతిరోజూ అనేక ట్యాగ్ లు వస్తుంటాయని తెలిపారు.
అవార్డు కార్యక్రమానికి సంబంధించిన పోస్టులు చూస్తూ ఉండగా అనుకోకుండా.. లైక్ చేసి ఉండొచ్చని చెప్పారు. అది అనవసరమైన విషయమని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను ఎప్పుడూ చీప్ పీఆర్ స్టంట్స్ యూజ్ చేయలేదని అన్నారు. తన కెరీర్ అంతా వర్క్ ద్వారానే ముందుకు సాగిందని తెలిపారు. సోషల్ మీడియాలో క్లిక్ బైట్ కోసం ఇలాంటి విషయాలను పెద్దగా చూపించడం బాధాకరమని ఆమె అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే మంచి పేరును సంపాదించుకున్నానని, అలాంటి వివాదాల్లో తనను లాగకూడదని ఆమె కోరారు. తనకు ఎలాంటి పీఆర్ టీమ్ కూడా లేదని యామీ గౌతమ్ తెలిపారు. అవార్డు కార్యక్రమాలపై తన అభిప్రాయాన్ని చాలా కాలం క్రితమే వెల్లడించానని, ప్రస్తుతం పూర్తిగా తన పని పైనే దృష్టి పెట్టానని పేర్కొన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం అవార్డు విషయంపై చర్చ ఇంకా కొనసాగుతోంది. ఏదేమైనా ఒక చిన్న సోషల్ మీడియా లైక్.. ఎంతటి పెద్ద చర్చకు దారి తీస్తుందో ఈ ఘటన మరోసారి ప్రూవ్ చేసింది.