రెహ‌మాన్ సంగీత‌ శైలి జెన్‌-Z కి న‌చ్చడం లేదా?

స్వ‌ర‌మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల బాలీవుడ్‌లో తనపై `మతపరమైన వివక్ష` బ‌లంగా ప‌ని చేసింద‌ని చేసిన‌ వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో పెను దుమారాన్నే రేపిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2026-01-18 08:30 GMT

స్వ‌ర‌మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల బాలీవుడ్‌లో తనపై `మతపరమైన వివక్ష` బ‌లంగా ప‌ని చేసింద‌ని చేసిన‌ వ్యాఖ్యలు భారతీయ చిత్ర పరిశ్రమలో పెను దుమారాన్నే రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌డిచిన రెండు రోజులుగా దీనిపై పెద్ద డిబేట్ న‌డుస్తోంది. ఈ అంశంపై లెజెండరీ సింగర్ హరిహరన్, కంపోజర్ లెస్లీ లూయిస్, కంగ‌న‌ తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు తెలియజేశారు. అయితే ఆయ‌న శైలి ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్ కి సూట్ కావ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు కూడా ఇప్పుడు తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది.

అస‌లు ఏఆర్ రెహమాన్ ఏమన్నారు? అంటే.. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ మాట్లాడుతూ..``గడిచిన ఎనిమిదేళ్లుగా బాలీవుడ్‌లో పవర్ షిఫ్ట్ జరిగింది. సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి అధికారం వెళ్లింది. అది మతపరమైన కోణం కూడా అయ్యుండొచ్చు.. కానీ అది నేరుగా నా ముఖం మీద జరగడం లేదు. ఫలానా సినిమాకు నిన్ను బుక్ చేద్దాం అనుకున్నాం కానీ మ్యూజిక్ కంపెనీ వేరే ఐదుగురిని తీసుకుంది అని నాకు చైనీస్ విష్పర్స్ (గుసగుసలు) వినిపిస్తున్నాయి`` అని అన్నారు. గడిచిన ఎనిమిదేళ్లుగానే కాదు, బాలీవుడ్ లో బొంబాయి, రోజా లాంటి చిత్రాలకు బ్లాక్ బ‌స్ట‌ర్ సంగీతం అందించినా కానీ, త‌న‌కు అవ‌కాశాలివ్వ‌కుండా కార్న‌ర్ చేసార‌ని, ద‌క్షిణాది ప్ర‌తిభావంతుల‌ను చిన్న చూపు చూస్తార‌ని రెహ‌మాన్ ఘాటుగా వ్యాఖ్యానించడంతో ఇది పెను దుమారం రేపుతోంది. ఇటు సినీరంగ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి దీనిపై పెద్ద డిబేట్లు పెడుతున్నారు.

రెహమాన్ వ్యాఖ్యలపై స్పందించిన హరిహరన్, లెస్లీ లూయిస్... పరిశ్రమలో ప్రస్తుతం సృజనాత్మకత కంటే డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హరిహరన్ మాట్లాడుతూ, ``ఇది ఒక గందరగోళమైన పరిస్థితి. కళ విషయానికి వస్తే మొదట సృజనాత్మకత గురించి ఆలోచించాలి. డబ్బు గురించి తర్వాత. కేవలం డబ్బు కోసమే కళను వాడితే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం`` అని పేర్కొన్నారు. లెస్లీ లూయిస్ స్పందిస్తూ-``పరిశ్రమలో మార్పు వచ్చింది. గతంలో సంగీతం తెలిసిన వ్యక్తులు నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు అంతా కార్పొరేట్ మయమైంది. నిర్ణయాలు తీసుకునేవారికి సంగీతం మీద అవగాహన కంటే తమ ఉద్యోగం భద్రంగా ఉందా లేదా అనే దానిపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది`` అని విమర్శించారు.

రెహమాన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖులు భిన్నంగా స్పందించారు. గాయ‌కుడు షాన్ మాట్లాడుతూ.. మ్యూజిక్‌లో మతపరమైన వివక్ష ఉండదు. నాకు కూడా ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. అంతమాత్రాన అది వివక్ష కాదు. గత 30 ఏళ్లుగా ముగ్గురు ఖాన్‌లు (షారుఖ్, సల్మాన్, అమీర్) మైనారిటీలైనా ఇండస్ట్రీని ఏలుతున్నారు కదా? అని కౌంటర్ ఇచ్చారు. రెహమాన్‌ను `వివక్ష చూపే వ్యక్తి` అని విమర్శించారు. తన సినిమా `ఎమర్జెన్సీ`కి సంగీతం అందించమని కోరితే, అది `ప్రోపగాండా` సినిమా అని చెప్పి ఆయన తనను కలవడానికి కూడా నిరాకరించారని కంగ‌న ర‌నౌత్ ఆరోపించారు. ర‌చ‌యిత జావేద్ అక్తర్ నేరుగా రెహమాన్ వ్యాఖ్యలతో విభేదించారు. ``రెహమాన్ చాలా పెద్ద వ్యక్తి.. చిన్న నిర్మాతలు ఆయనను సంప్రదించడానికి భయపడుతుంటారు. ఇందులో మతపరమైన కోణం ఏమీ లేదు!`` అని సెటైరిక‌ల్ గా స్పందించారు. విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) ప్రతినిధులు మాట్లాడుతూ-`రెహమాన్ కు అవకాశాలు కావాలంటే మళ్ళీ `ఘర్ వాపసీ` (స్వధర్మం) అవసరం`` అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రెహమాన్ వంటి అంతర్జాతీయ స్థాయి కళాకారుడు ఇలాంటి ఆవేదన వ్యక్తం చేయడం బాలీవుడ్‌లో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలను బయటపెట్టింది. ఈ అంశంపై నెటిజనులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే రెహ‌మాన్ సందేహించిన‌ట్టుగా తెర‌వెన‌క అత‌డిని అణ‌గ‌దొక్కేందుకు ఏవైనా ``అదృశ్య శక్తులు`` పని చేస్తున్నాయా? అన్న‌ది సందిగ్ధంగానే ఉందని కొంద‌రు అన్నారు.

రెహమాన్ వ్యాఖ్యలపై పొలిటిక‌ల్ కారిడార్ లో దుమారం చెల‌రేగింది. విశ్వహిందూ పరిషత్ (VHP) వంటి సంస్థలు రెహమాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. భారతదేశం మీకు పేరు, ప్రఖ్యాతులు, అవార్డులు ఇచ్చింది. ఇప్పుడు మత వివక్ష అని మాట్లాడటం సమంజసం కాదు! అని వారు పేర్కొన్నారు. మ‌రికొంద‌రు ఆయనను `విక్టిమ్ కార్డ్` ప్లే చేస్తున్నారని విమర్శించారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక గొప్ప కళాకారుడికి కూడా ఇలాంటి వివక్ష ఎదురవుతుంటే, కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఏంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే సినిమా అనేది ఒక వ్యాపారం. రెహమాన్ రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండటం వల్ల లేదా ఆయన శైలి ప్రస్తుత ట్రెండ్‌కు సరిపోక నిర్మాతలు వేరే వారిని ఎంచుకోవచ్చు. దానికి మతం రంగు పులమడం సరికాదని కొందరు వాదిస్తున్నారు.

ఈ దుమారం కారణంగా బాలీవుడ్‌లోని `మ్యూజిక్ మాఫియా`, `అవుట్‌సైడర్ vs ఇన్‌సైడర్` చర్చ మళ్ళీ మొదటికి వచ్చింది. రెహమాన్ ఈ వ్యాఖ్యల తర్వాత తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ `కమ్యూనల్` ట్యాగ్ మాత్రం పరిశ్రమలో హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది.

Tags:    

Similar News