పూజా హెగ్డే.. ఇంకొక్క ఛాన్స్

Update: 2018-04-26 09:25 GMT
ఉత్తరాది కథానాయికలు దక్షిణాదిన ఎంత పేరు తెచ్చుకున్నా.. ఏ రేంజికి ఎదిగినా బాలీవుడ్ అవకాశం అనగానే కాళ్లు నేలపై నిలవవు. ఇక్కడి కమిట్మెంట్లు పక్కన పెట్టేసి అయినా అక్కడికెళ్లి సినిమాలు చేసి వస్తారు. అక్కడ వరుసగా ఎదురు దెబ్బలు తగిలినా ఆశలు వదులుకోరు. హిందీలో చేస్తే దేశం మొత్తం ఫేమ్ వస్తుందని.. రేంజ్ పెరుగుతుందని వాళ్ల ఆశ. తమన్నా.. కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లు ఇదే బాటలో నడిచారు. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇలాంటి ప్రయత్నంలోనే ఉంది. ఆమె హిందీలో నటించిన ‘మొహెంజదారో’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. దాని కంటే ముందు తెలుగులో ఆమె ‘ఒక లైలా కోసం’.. ‘ముకుంద’ సినిమాలు చేసింది. అవి అంతగా ఆడకపోయినా పూజాకు ఇక్కడ క్రేజ్ వచ్చింది. అవకాశాలు వచ్చాయి.

అయినప్పటికీ వాటిని కాదని ‘మొహెంజదారో’కు రెండేళ్లు అంకితమైంది. దాని ఫలితమేంటో తెలిసిందే. దీంతో తిరిగి టాలీవుడ్‌కు వచ్చి ‘దువ్వాడ జగన్నాథం’ చేసింది. మంచి పేరు సంపాదించింది. అవకాశాలూ అందుకుంది. ఏకంగా ఇప్పుడు మహేష్ బాబు సరసనే నటించబోతోంది పూజా. ఇలా టాలీవుడ్లో కెరీర్ మాంచి ఊపుమీదుండగా.. ఆమె మళ్లీ బాలీవుడ్లో ఓ సినిమా చేయడానికి అంగీకరించింది. ‘హౌస్‌ ఫుల్’ సిరీస్‌ లో రాబోయే నాలుగో సినిమాలో పూజా ఒక పాత్ర చేయనుందట. ఐతే ఈ మల్టీస్టారర్ మూవీలో పూజాకు ఏమాత్రం రోల్ ఉంటుందో.. అది ఏమాత్రం పేరు తెస్తుందో అన్నది సందేహం. తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తూ ఈ చిత్రానికి అసలు డేట్లు ఎలా సర్దుబాటు చేస్తుందో కూడా చూడాలి. ఏదైతేనేం హిందీలో మళ్లీ ఒక అవకాశమైతే దక్కించుకుంది పూజ. మరి దీని రిజల్ట్ ఎలా ఉంటుందో?
Tags:    

Similar News