కంప్యూటర్ మాయ కాదు.. కంటిముందు జరిగే సాహసాలకే!
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతీ రంగాన్నీ శాసిస్తోంది. వినోద పరిశ్రమపై ఏఐ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతీ రంగాన్నీ శాసిస్తోంది. వినోద పరిశ్రమపై ఏఐ ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, వాయిస్ క్లోనింగ్, డీ-ఏజింగ్ టెక్నాలజీ నుంచి ఏకంగా డిజిటల్ నటుల సృష్టి వరకు ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తోంది. ఈ సాంకేతిక విప్లవం నిర్మాణ ప్రక్రియను సులభతరం చేస్తున్నా? మరొకవైపు నటుల ఉపాధిని, మానవ సృజనాత్మకతను, వెండితెరపై సహజత్వాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళనలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో హాలీవుడ్ యాక్షన్ దిగ్గజం టామ్ క్రూజ్ మాత్రం ప్రేక్షకులు ఎప్పుడూ వెండితెరపై నిజమైన అనుభూతులనే చూడాలని కోరుకుంటారని అభిప్రాయపడ్డారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఏఐ ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ మానవ నైపుణ్యానికి, సహజమైన అభినయానికి, నిజమైన శ్రమకు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ప్రమాదకరమైన స్టంట్లను స్వయంగా చేస్తూ రియల్ యాక్షన్ హీరో గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టామ్ క్రూజ్ సాంకేతికత కంటే నటనలోని ప్రామాణికతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నది కాదనలేని నిజం.
`మిషన్: ఇంపాజిబుల్`, `టాప్ గన్: మావెరిక్` వంటి చిత్రాలలో సిజిఐ .. ఏఐ పై ఆధారపడకుండా నిజమైన విమానాలు నడపడం, భవనాలపై నుంచి దూకడం వంటి స్టంట్స్‌తో ప్రేక్షకులను అలరించడం టామ్ శైలి. ఈ నేపథ్యంలోనే ఏఐ టెక్నాలజీ మాయాజాలంతో నిజమైన సినిమా అనుభూతి కనుమరుగు కాకూడదని అభిప్రాయపడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమకు సహాయక సాధనంగా ఉపయోగపడవచ్చు. కానీ నటుడి కష్టం, చెమట, భావోద్వేగాలను రీక్రియేట్ చేయలేదని క్రూజ్ పేర్కొన్నారు. స్క్రీన్ పై ఏది అసలైనదో? ఏది కంప్యూటర్ లేదా ఏఐ సృష్టించినదో? ప్రేక్షకులు సులభంగా గుర్తించగలరన్నారు. నటుడు పడే కష్టం, ఆ సన్నివేశంలో ప్రతిబింబించే నిజమైన భయం ..ఉత్సాహం మాత్రమే ప్రేక్షకుడికి థియేటర్లలో అసలైన అనుభూతిని అందిస్తాయని వివరించారు.
ప్రస్తుతం హాలీవుడ్‌లో ఏఐ ప్రవేశంపై నటులు, రచయితల సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో టామ్ క్రూజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, నిజమైన లొకేషన్లు , మానవ శ్రమతో రూపొందే సినిమాలే ఎప్పటికీ నిలిచిపోతాయని.. గ్రాఫిక్స్ , డిజిటల్ సృష్టి ఆధారంగా తీసే చిత్రాలు శాశ్వతమైన ఆదరణ పొందలేవని టామ్ క్రూజ్ బలంగా విశ్వసిస్తున్నారు.
ప్రేక్షకులు విలువైన సమయాన్ని, డబ్బును వెచ్చించి థియేటర్లకు వచ్చేది నిజమైన వినోదాన్ని ఆస్వాదించ డానికేనని టామ్ క్రూజ్ గుర్తు చేశారు. రాబోయే తరం దర్శక, నటులు సాంకేతికతపై పూర్తిగా ఆధారపడకుండా కథనంలోనూ, నటనలోనూ సహజత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏఐ విస్తరణ వేగంగా జరుగుతోన్న సమయంలో దశాబ్దాలుగా హాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న టామ్ క్రూజ్ మాటలు పరిశ్రమకు సరికొత్త దిశానిర్దేశం చేస్తున్నాయి.