టాలీవుడ్ నుంచి నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్!
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ అంటే? ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తారు.
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్స్ అంటే? ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తారు. `వారణాసి` విజయం అనంతరం ఆ వరుసలో సూపర్ స్టార్ మహేష్ చేరుతారు. గ్లోబల్ వైడ్ వారణాసి కనెక్ట్ అయితే? మహేష్ ఆ ఒక్క విజయంతోనే గ్లోబల్ స్టార్ గా అవతరిస్తారు. అయితే వీరందరి తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యే సత్తా మిగతా తెలుగు హీరోల్లో ఎవరికి ఉంది? అన్నదే ఆసక్తికరం. ఈ నేపథ్యంలో పలువురు యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోలు పోటీగా కనిపిస్తున్నారు.
తేజ సజ్జా, అడవి శేష్, నాని, విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థ్‌ల పేర్లు ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. నటనలో వైవిధ్యం, మాస్-క్లాస్ ఆడియెన్స్‌లో ఆదరణ ఉన్న నాని ఈ రేసులో ముందంజలో ఉన్నారు. `దసరా`, `సరిపోదా శనివారం` వంటి సినిమాలతో మార్కెట్ పరిధిని విస్తరించుకున్న నాని స్ట్రాంగ్ కంటెంట్ ..పెర్ఫార్మెన్స్‌తో పాన్ ఇండియా రేసులో దూసుకుపోతున్నారు. మరోవైపు `లైగర్` రూపంలో నిరాశ ఎదురైనా? విజయ్ దేవరకొండకు ఉన్న యూత్ ఫాలోయింగ్, స్టార్ ఇమేజ్, ఆటిట్యూడ్ అతడిని ప్రత్యేకంగా నిలబెడతాయి. సరైన సాలిడ్ మాస్ కంబ్యాక్ పడితే విజయ్ దేవరకొండ నెక్స్ట్ పాన్ ఇండియా ఐకాన్‌గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
కాన్సెప్ట్ ఆధారిత చిత్రాలతో ఉత్తరాదిలో జెండా పాతిన హీరోలుగా తేజ సజ్జా, నిఖిల్ సిద్ధార్థ్ నిలిచారు. `హను-మాన్` చిత్రంతో ఏకంగా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రశాంత్ వర్మతో కలిసి అంతర్జాతీయ సంచలనం సృష్టించిన తేజ సజ్జా లార్జర్ ద్యాన్ లైఫ్, మైథాలజీ అంశాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అలాగే `కార్తికేయ 2` చిత్రంతో డివైన్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో నేషనల్ స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన నిఖిల్, హిస్టారికల్ , మిస్టరీ డ్రామాలతో ఉత్తరాదిలో తనకంటూ ప్రత్యేక మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు.
సక్సెస్ రేషియో పరంగా చూస్తే అడవి శేష్ అన్‌బీటబుల్ రికార్డ్‌తో కొనసాగుతున్నారు. `మేజర్` చిత్రంతో జాతీయ స్థాయిలో అభినందనలు అందుకోవడమే కాకుండా `గూఢచారి`, `హిట్ 2` వంటి వరుస థ్రిల్లర్లతో నార్త్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యారు. రచయిత కూడా కావడంతో కథల ఎంపికలో శేష్ చూపే నైపుణ్యం, మినిమమ్ గ్యారెంటీ చిత్రాలను అందించే తీరు ఆయన్ని పాన్ ఇండియా లీగ్‌లో విశ్వసనీయమైన హీరోగా నిలబెడుతోంది. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తూ శేష్ క్రమంగా మార్కెట్ రేంజ్‌ను పెంచుకుంటున్నారు.
అయితే వీరిలో నెక్స్ట్ బిగ్ పాన్ ఇండియా స్టార్ ఎవరు అనేది కేవలం ఒక్క హిట్ తోనే సాధ్యపడదు. వారు ఎంచుకునే కథలు, దర్శక నిర్మాతలు , ప్రమోషన్ వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ఉత్తరాది ప్రేక్షకుల నాడిని పట్టుకుని, మన ప్రాంతీయ మూలాలను కోల్పోకుండా యూనివర్శల్ అప్పీల్ ఉన్న కాన్సెప్ట్‌లను ఎంచుకోవడమే ఇక్కడ కీలకం. కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాకుండా బలమైన స్క్రిప్ట్ సెలెక్షన్ ఉన్న హీరోకే నేషనల్ ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారని ఇప్పటికే పలు సినిమాలు నిరూపించాయి.