హీరోల నుంచి ప్రొడ్యూసర్స్‌గా.. టాలీవుడ్‌లో సక్సెస్ స్టోరీలు ఇవే!

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండే మన హీరోలు కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకీ అడుగుపెడుతున్నారు.

Update: 2026-09-22 10:30 GMT

టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉండే మన హీరోలు కేవలం యాక్టింగ్‌కే పరిమితం కాకుండా నిర్మాణ రంగంలోకీ అడుగుపెడుతున్నారు. అటు హీరోలుగా రికార్డులు సృష్టిస్తూనే, ఇటు నిర్మాతలుగా మారి భారీ విజయాలను అందుకుంటున్నారు. కంటెంట్ ఉన్న కథలను ప్రోత్సహించడం, నచ్చిన ప్రాజెక్టులను నిర్మించడం లక్ష్యంగా టాలీవుడ్ అగ్ర మరియు యువ హీరోలు సొంత బ్యానర్లు స్థాపించి సక్సెస్ ఫుల్ నిర్మాతలుగా నిలుస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీలపై ఓ లుక్కేద్దాం..

'రామ్ చరణ్ – కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ:

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్‌ను స్థాపించి మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’తో నిర్మాతగా మారారు. ఆ తర్వాత అత్యంత భారీ బడ్జెట్‌తో ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. గ్లోబల్ హిట్ సాధించి ఆస్కార్ గెలుచుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామిగా వ్యవహరించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన ముద్ర వేశారు.

మహేష్ బాబు – జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్:

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తన సొంత చిత్రం ‘శ్రీమంతుడు’తో ప్రయాణం మొదలుపెట్టి హ్యాట్రిక్ హిట్లు అందుకున్నారు. అంతేకాకుండా అడవి శేష్ కథానాయకుడిగా తెరకెక్కిన దేశభక్తి చిత్రం ‘మేజర్’ ను నిర్మించి పాన్ ఇండియా స్థాయిలో విమర్శకుల ప్రశంసలు, వసూళ్లు రాబట్టి నిర్మాతగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.

నాని – వాల్ పోస్టర్ సినిమా:

సహజ నటుడు నాని ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. వైవిధ్యమైన, కొత్తదనంతో కూడిన చిత్రాలను అందించడమే లక్ష్యంగా ఆయన ‘అ!’, సూపర్‌హిట్ ‘హిట్’ ఫ్రాంచైజ్, అలాగే ‘మీట్ క్యూట్’ వంటి ప్రాజెక్టులను నిర్మించారు. ఇక చిన్న సినిమాలను, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ప్రశంసలతో పాటు వ్యాపారపరంగానూ మంచి లాభాలను అందుకుంటున్నారు.

విజయ్ దేవరకొండ: 'కింగ్ ఆఫ్ ది హిల్' ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ను ఏర్పాటు చేసి 'మీకు మాత్రమే చెప్తా' వంటి విభిన్న చిత్రాలతో నిర్మాతగా అడుగుపెట్టారు. ఇక కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ప్రొడక్షన్స్ వైపు అడుగులు వేస్తున్నారు

కల్యాణ్ రామ్ – ఎన్టీఆర్ ఆర్ట్స్:

నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్‌పై ఎంతో కాలంగా నాణ్యమైన చిత్రాలను నిర్మిస్తున్నారు. తన సొంత సినిమాలైన ‘పటాస్’, ‘బింబిసార’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ వంటి భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించి టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు.

యువ హీరోల బాట:

ఈ అగ్ర హీరోల బాటలోనే నేటి తరం యువ హీరోలైన విశ్వక్ సేన్, అడవి శేష్, నిఖిల్ సిద్ధార్థ్,కిరణ్ అబ్బవరం, కూడా పయనిస్తున్నారు. తమ సినిమాల్లో భాగస్వాములుగా మారడం లేదా సొంత బ్యానర్లు పెట్టి కంటెంట్ ఉన్న విభిన్నమైన కథలతో సినిమాలు తీస్తూ సక్సెస్ సాధిస్తున్నారు.

ఇక హీరోలు నిర్మాతలుగా మారడం వల్ల టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలు, వైవిధ్యమైన కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక సరికొత్త సాంకేతికతతో, నాణ్యమైన ప్రమాణాలతో సినిమాలు నిర్మిస్తూ టాలీవుడ్ స్థాయిని పెంచుతున్న ఈ హీరోల ప్రొడక్షన్ ప్రయాణం నిజంగా అభినందనీయం.

Tags:    

Similar News