51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజినీర్లు.. సూర్య ది గ్రేట్.. దేశంలో పేద‌ల విద్య‌కు టాప్-5 స్టార్ల సాయం!

సూర్యకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ `అగరం ఫౌండేషన్` సాధించిన అద్భుతమైన మైలురాయిని పాపుల‌ర్ నటుడు ఆర్. మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అభినందించారు.

Update: 2026-09-22 08:59 GMT

సూర్యకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ `అగరం ఫౌండేషన్` సాధించిన అద్భుతమైన మైలురాయిని పాపుల‌ర్ నటుడు ఆర్. మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అభినందించారు. సామాజిక, ఆర్థికపరమైన అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నత విద్యను అభ్యజిస్తున్న ఎంతో మంది ప్రథమ తరం విద్యార్థులకు ఈ ఫౌండేషన్ అండగా నిలుస్తోందని పేర్కొంటూ.. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 51 మంది డాక్టర్లు, 1800 మంది ఇంజనీర్లు రూపుదిద్దుకున్నారని మాధవన్ ఆ పోస్ట్‌లో కొనియాడుతూ సెల్యూట్ ఇమోజీని షేర్ చేసారు.

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `యువ` సినిమా నాటి నుంచి సూర్య, మాధవన్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. ఇటీవల మాధవన్ నటించిన `జిడిఎన్` (GD నాయుడు బయోపిక్) చిత్రంపై సూర్య ప్రశంసలు కురిపించగా... అలాగే మాధవన్ కీలక పాత్ర పోషించిన `ధురంధర్` సినిమాను సూర్యతో పాటు ఆయన భార్య జ్యోతిక కూడా ఆకాశానికెత్తారు. ఇక మాధవన్ కూడా జ్యోతికతో కలిసి `డుమ్ డుమ్ డుమ్`, `ప్రియమాన తోజి`, `హైవాన్` వంటి చిత్రాల్లో నటించి అద్భుతమైన ఆన్‌స్క్రీన్ జోడీగా గుర్తింపు పొందారు. విద్యారంగంపై సూర్య చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కేవలం తెరపై నటనతోనే కాకుండా, నిజ జీవితంలోనూ రియల్ హీరోలుగా నిలుస్తూ ఎంతోమంది పేద విద్యార్థుల, పేద మహిళల విద్యాభ్యాసానికి- భవిష్యత్తుకు భరోసానిస్తున్న టాప్-5 ప్రముఖ నటుల వివరాలు:

సోనూ సూద్ :

కోవిడ్ కాలం నుండి దేశవ్యాప్తంగా `రియల్ హీరో`గా గుర్తింపు తెచ్చుకున్న సోనూ సూద్, విద్య -వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పేద విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద అమ్మాయిలకు ఉచిత ఉన్నత విద్యను అందించడానికి `సూద్ ఛారిటీ ఫౌండేషన్` ద్వారా వేలాది మందికి స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. చదువుకోవడానికి ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది విద్యార్థుల ఫీజులను స్వయంగా భరిస్తూ వారి కలలను సాకారం చేస్తున్నారు.

త‌మిళ హీరో సూర్య :

కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు సూర్య. తన తండ్రి శివకుమార్ పేరు మీద `అగరం ఫౌండేషన్` స్థాపించి, గత రెండేళ్లుగా నిరుపేద విద్యార్థుల చదువు కోసం కృషి చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులకు... ఒంటరి మహిళల పిల్లలకు.. అనాథలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంలో ఈ సంస్థ ముందుంది. ఎంతోమంది పేద విద్యార్థులను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడంలో సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

అక్షయ్ కుమార్ :

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సమాజ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, విద్యా సంస్థల అభివృద్ధికి విరాళాలు ఇస్తున్నారు. అలాగే సైనిక సంక్షేమ నిధులతో పాటు పేదరికంలో మగ్గుతున్న మహిళల ఉపాధికి, వారి పిల్లల చదువులకు సహాయం చేసే వివిధ ప్రభుత్వ .. స్వచ్ఛంద సంస్థలకు ఆయన నిరంతరం అండగా నిలుస్తున్నారు.

సల్మాన్ ఖాన్ :

తన `బీయింగ్ హ్యూమన్` ట్రస్ట్ ద్వారా సల్మాన్ ఖాన్ ఎన్నో సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేదరికంలో ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం. పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపరచడంలో ఈ ఫౌండేషన్ క్రియాశీలకంగా పనిచేస్తుంది. అంతేకాకుండా.. పేద మహిళలు .. బాలికల విద్య, ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.

రామ్ చరణ్ :

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ .. ఆయన సతీమణి ఉపాసన కలిసి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పాఠశాలలను దత్తత తీసుకోవడం.. వారికి అవసరమైన పుస్తకాలు- డిజిటల్ విద్యను అందించడంలో సహాయం చేస్తున్నారు. అలాగే పేద మహిళల ఆర్థిక స్వయం ఉపాధికి .. వారి పిల్లల విద్యాభ్యాసానికి పలు ట్రస్ట్‌ల ద్వారా అండగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News