నేను చస్తేనే ఆ డైరెక్టర్ పై చర్యలా..? పోలీసులపై హీరోయిన్ ఫైర్

Update: 2020-12-22 08:10 GMT
‘మీకు ఫిర్యాదు చేసి నాలుగు నెలలు గడిచాయి. అయినా కానీ.. అతనిపై ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. నేను చనిపోతేనే మీరు చర్యలు తీసుకుంటారా?’ అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ నటి పాయల్ ఘోష్.

ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై కొద్ది నెలల క్రితం లైంగిక ఆరోపణలు చేసింది పాయల్ ఘోష్. సినిమా అవకాశాల కోసం ఆయనకు వద్దకు వెళ్తే.. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఆ వెంటనే అనురాగ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో పెను దుమారమే రేపింది. దీనిపై తాజాగా స్పందించింది ఘోష్.

పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవట్లేదన్న పాయల్.. వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘మీరు విచారణ సరిగా చేయడం లేదు, మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇది ఒక మహిళకు సంబంధించిన విషయం’ అంటూ ట్వీట్ చేసింది. ‘ఆధారాలతో సహా ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. అయినప్పటికీ అనురాగ్ కశ్యప్‌పై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు’ అంటూ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘నేను చనిపోతే గానీ ఈ కేసు ముందుకు కదలదా’? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది పాయల్ ఘోష్.

కాగా.. ఈ కేసు విషయమై పాయ‌ల్ ఘోష్ గతంలో ఢిల్లీలో జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌ని కూడా క‌లిసింది. ఇక, లైంగిక వేధింపుల కేసులో భాగంగా వెర్సోవా స్టేషన్‌లో కశ్య‌ప్‌ను దాదాపు ఎనిమిది గంటలపాటు పోలీసులు విచారించిన విష‌యం విదిత‌మే. ఈ విచార‌ణ‌లో ఆయ‌న పాయ‌ల్ ఆరోపణలను ఖండించారు. ఆ స‌మ‌యంలో తాను వేరే దేశంలో ఉన్న‌ట్టు పేర్కొన్నారు కశ్యప్. తాజాగా.. పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ తో మరోసారి లైంగిక వేధింపుల అంశం తెరపైకి వచ్చింది. మరి, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News