పవన్-త్రివిక్రమ్.. అంత కొత్తగా ఉంటుందా?

Update: 2016-10-19 07:30 GMT
తమిళ దర్శకుడు టీఎన్ నీశన్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనుకోకుండా మొదలవడంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేయాల్సిన సినిమాపై కొంచెం సందేహాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఉండదని కాదు కానీ.. ఇప్పట్లో ఉండదేమో అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తేలిపోయింది. నవంబర్లోనే ఈ సినిమాను మొదలుపెట్టేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మూడు సినిమాలకు పవన్ ఎలా డేట్లు కేటాయిస్తాడో ఏమో కానీ.. ఈ ఏడాదే మూడో సినిమా ప్రారంభోత్సవం మాత్రం జరిపించేస్తున్నాడు. ఐతే త్రివికమ్ సినిమాను ఊరికే మొక్కుబడిగా ప్రారంభోత్సవం జరిపించేసి వదిలేయట్లేదు పవన్.

ఈ సినిమా షూటింగ్ కూడా సాధ్యమైనంత త్వరగా మొదలయ్యేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమిళ కుర్రాడు అనిరుధ్ కూడా కన్ఫమ్ అయిపోయాడు. పవన్-త్రివిక్రమ్ సినిమాకు పని చేయబోతున్నట్లు కన్ఫమ్ చేయడమే కాదు.. త్వరలోనే పని మొదలవుతుందని కూడా వెల్లడించాడు అనిరుధ్. అంతే కాక.. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుందని.. ఇది విభిన్నమైన కథ అని కూడా చెప్పాడు అనిరుధ్.

పవన్-త్రివిక్రమ్ అనగానే చాలా వరకు మసాలా ఎంటర్టైనర్లే ఆశిస్తారు ప్రేక్షకులు. ఐతే మొత్తం స్క్రిప్టు నరేషన్ విన్న అనిరుధ్.. ఇది చాలా వైవిధ్యమైన కథ అంటున్నాడు. ఇంతకుముందు పవన్-త్రివిక్రమ్ కలిసి ‘కోబలి’ అనే ప్రయోగాత్మక చిత్రం చేయాలనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. బహుశా దాన్నే ఇప్పుడు బయటికి తీస్తున్నారా.. ఇంకేదైనా కొత్త కథను త్రివిక్రమ్ రెడీ చేస్తున్నాడా తెలియదు కానీ.. జల్సా.. అత్తారింటికి దారేది తరహాలో ఈ సినిమా ఉండదని మాత్రం అర్థమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News