ఓటీటీలోకి కొత్త సినిమాలు.. ప్రేక్షకులకు డిజిటల్ విందు రెడీ..!

Update: 2021-05-01 10:30 GMT
కరోనా మహమ్మారి విజృంభనతో థియేటర్లకు వెళ్లడానికి ప్రేక్షకులు భయపడే రోజులు మళ్ళీ వచ్చేశాయి. దీంతో స్వచ్ఛందంగా థియేటర్లు మూసేయడానికి ఎగ్జిబిటర్లు ముందడుగు వేస్తున్నారు.. ఫిలిం మేకర్స్ సినిమాల విడుదల వాయిదా వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా పరిశ్రమకు సినీ అభిమానులకు మళ్లీ ఓటీటీ వేదికలే దిక్కవుతున్నాయి. ఈ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో ఇటీవల విడుదలైన సినిమాలను ఓటీటీలలో స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. అలానే చిన్న చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే కింగ్ నాగార్జున 'వైల్డ్ డాగ్' సినిమా నెట్ ఫ్లిక్స్ బ్లో.. శర్వానంద్ 'శ్రీకారం' సన్ ఎన్ఎక్స్ టి ఓటీటీలలో సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో నిన్న శుక్రవారం స్ట్రీమింగ్ చేశారు. అలానే కార్తీ - రష్మిక కలిసి నటించిన 'సుల్తాన్' చిత్రాన్ని కూడా నిన్నటి నుంచి 'ఆహా' యాప్ లో ప్రసారం చేశారు. ఇదే క్రమంలో సందీప్ కిషన్ 'A1 ఎక్స్‌ ప్రెస్' సినిమాని జియో సినిమాస్ మరియు సన్ ఎన్ఎక్స్ టీ ఓటీటీలో వదిలారు. 'రాబర్ట్' అనే డబ్బింగ్ సినిమా కూడా ఆమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసిన అనసూయ భరద్వాజ్ 'థ్యాంక్ యు బ్రదర్' చిత్రం మే 7న 'ఆహా'లో డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుంది.

సమంత అక్కినేని డెబ్యూ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్-2 మే రెండో వారం నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అదే రాజ్ & డీకే రూపొందించిన 'సినిమా బండి' సినిమా మే 14న నెట్1 ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది. ఇదే క్రమంలో రానా దగ్గుబాటి నటించిన త్రిభాషా చిత్రం 'అరణ్య' మే 14న జీ5 ఓటీటీలోకి రానుంది. నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటించిన 'రంగ్ దే' సినిమా జీ5 లో మే 21న రాబోతున్నట్లు తెలుస్తోంది. నితిన్ మరో సినిమా 'చెక్' కూడా త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మంచు విష్ణు - కాజల్ అగర్వాల్ కలిసి నటించిన 'మోసగాళ్ళు' సినిమా మే నెలలోనే డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లలో ప్రసారం అవుతుంది. సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా పే ఫర్ వ్యూ విధానంలో మే 13న రిలీజ్ అవుతోంది. కోవిడ్ నేపథ్యంలో వినోద పరిశ్రమ పూర్తిగా మూతబడుతున్నప్పటికీ.. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ (ఓటీటీ) ప్రేక్షకులకు డిజిటల్ విందు అందిస్తోందని చెప్పవచ్చు.
Tags:    

Similar News