చిరంజీవి, సింహం కోసం అతడు సిద్దంగానే!
నటసింహ బాలకృష్ణ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందని పబ్లిక్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయాలని ఉందని పబ్లిక్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా ఆ ఛాన్స్ కూడా బోయపాటి శ్రీను కే ఇచ్చారు చిరంజీవి. బాలయ్య కు బ్లాక్ బస్టర్లు ఇచ్చిన నేపథ్యంలో తమ కాంబినేషన్ కి..ఇమేజ్ కి తగ్గ స్టోరీ బోయపాటి మాత్రమే సిద్దంగా చేయగలడని నమ్మి చిరు ఆ బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ వేదికపై బోయపాటి మాత్రం ఎలాంటి కన్పర్మేషన్ ఇవ్వలేదు. కానీ మనస్పూర్తిగా ఓ నవ్వు నవ్వి అంతకుమించి మరో అదృష్టం ఉంటుందా? అని సరిపెట్టారు.
ఆ తర్వాత మళ్లీ దీనిపై బోయపాటి ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా సింహాన్ని, చిరంజీవి ని ఒకే ప్రేమ్ లో చూపించడానికి హిట్ మెషిన్ అనీల్ రావిపూడి కూడా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అవకాశం వస్తే తప్పకుండా ఆ ఛాన్స్ తానే తీసుకుంటానని ప్రకటించాడు అనీల్. ఇద్దరి ఇమేజ్ కు తగ్గ కథ కుదిరితే? ఎందుకు చేయను అని అన్నారు. దీంతో బాలయ్య, చిరంజీవి కోసం అనీల్ కూడా సంసిద్దంగా ఉన్నట్లు తేలిపోయింది. మరి అనీల్ విషయంలో చిరంజీవి, బాలయ్య ఎలా ఉన్నారు? అన్నది అంతే ముఖ్యం. అనీల్ కు ఇంత వరకూ ఎలాంటి వైఫల్యం లేదు.
చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇంకా చెప్పాలంటే చిరంజీవి కంటే అనీల్ గురించి బాలయ్యకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇప్పటికే బాలయ్య హీరోగా అనీల్ `భగవంత్ కేసరి` అనే చిత్రం కూడా తెరకెక్కించాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 139 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బాలయ్య కెరీర్ లోనే హాయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అలా బాలయ్య దృష్టిలో అనీల్ గొప్ప దర్శకుడిగా నిలిచాడు. ఇక చిరంజీవి అనీల్ తో కలిసి `మనశంకరవరప్రసాద్ గారు` అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
చిరు ఎంతో నమ్మకంతో చేస్తోన్న ప్రాజెక్ట్ ఇది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అయితే గనుక చిరంజీవి పుల్ హ్యాపీ. అనీల్ కి మరో ఛాన్స్ ఇవ్వడానికి ఎంత మాత్రం వెనకడుగు వేయరు. ఈ నేపథ్యంలో అనీల్ చిరు-బాలయ్యలను సరైన స్టోరీతో అప్రోచ్ అయితే మల్టీస్టారర్ కు పెద్దగా సమయం పట్టదు. కానీ ఇక్కడో సమస్య ఉంది. ప్రస్తుతం చిరు-బాలయ్య మధ్య సఖ్యత ఎలా ఉందన్నది కీలకం. ఆ మధ్య అసెంబ్లీ లో బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే.
ప్రతిగా ఆ వ్యాఖ్యలకు చిరంజీవి కౌంటర్ వేయడం తో సన్నివేశం మరింత రసవత్తరంగా మారింది. సోషల్ మీడియా వేదికగా అభిమానుల మధ్య వైషామ్యాలు మళ్లీ మొదలైనట్లు కనిపించింది. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తుండటంతో? ఆ వివాదం అక్కడితో చల్లారినట్లు కనిపించింది. మరి ఈ పరిస్థితులు మల్టీస్టారర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? అన్నది చూడాలి.