నటి హిందూ ఆలయ దర్శనం ఘోర పాపం?
ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు.;
ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఈ నటి పవిత్రమైన భస్మ హారతిలో పాల్గొని పూజలాచరించారు. అనంతరం ఆలయ పూజారులు శాలువా కప్పి సత్కరించారు. నూతన సంవత్సరం రాక ముందే నుష్రత్ అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. అయితే ఈ సందర్శనాన్ని ముస్లిమ్ మత పెద్దలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆమె ఒక ముస్లిమ్ అయి ఉండి ఇలా హిందూ దేవాలయాన్ని సందర్శించడాన్ని `ఘోర పాపం`గా అభివర్ణించారు.
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి మాట్లాడుతూ.. షరియా చట్టం ప్రకారం ఆమె పూజలు చేయడం .. చందనం పూసుకోవడం `ఘోర పాపం` అని పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. సదరు నటి పశ్చాత్తాపపడి కల్మా పఠించాలని మౌలానా డిమాండ్ చేశారు. అయితే నుష్రత్ భరూచా మతచాందస ధోరణికి భిన్నంగా తన అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆలయం, మసీదు లేదా చర్చి ఏదైనా సరే ప్రార్థనా స్థలాలలో శాంతిని పొందవచ్చని తాను నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. నా నమ్మకం వాస్తవమైనది.. నేను దీనిని అనుసరిస్తానని బలంగా చెప్పారు.
మందిరం అయినా, గురుద్వారా అయినా లేదా చర్చిలో అయినా .. ఎక్కడ ప్రశాంతత లభిస్తే అక్కడికి వెళ్లాలి. నేను ఈ విషయాన్ని బహిరంగంగా కూడా చెబుతాను.. నేను నమాజ్ చేస్తాను.. టైమ్ దొరికితే రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాను. ప్రయాణాలలో నా ప్రార్థన చాపను కూడా వెంట తీసుకువెళ్తాను. నేను ఎక్కడికి వెళ్లినా, అదే శాంతిని, ప్రశాంతతను పొందుతాను. ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడూ నమ్ముతాను.. నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నాను! అని నుష్రత్ బలమైన టోన్ వినిపించారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే, నుష్రత్ భరూచా చివరిగా `ఉఫ్ యే సియాపా` అనే మూకీ చిత్రంలో కనిపించారు. తదుపరి బన్ టిక్కీ కొత్త సంవత్సురంలో విడుదల కానుంది.