నాని ఇలా వాడటం ఆరోసారి

Update: 2019-02-25 06:27 GMT
నిన్న సాయంత్రం నాని 24కి గ్యాంగ్ లీడర్ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మెగా ఫ్యాన్స్ దానికి నిరసనగా న్యాచురల్ స్టార్ అభిమానులు మద్దతుగా ట్విట్టర్ లో మాటల యుద్ధం బాగానే చేసుకుంటున్నారు . దీనికి నాని స్పందన ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే ఇలా క్లాసిక్ టైటిల్స్ ని నాని వాడుకోవడం ఇది మొదటి సారి కాదు. గ్యాంగ్ లీడర్ తో కలిపి మొత్తం ఆరు సార్లు ఈ వాడకం జరిగింది.

మొదటిది పిల్ల జమిందార్. అశోక్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ నానికి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఇదే టైటిల్ తో 1980లో ఏఎన్ఆర్ జయసుధల కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చింది . బాగానే ఆడింది కూడా. తర్వాతది 1993లో వచ్చిన జెంటిల్ మెన్. శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా రూపొందిన మాస్టర్ క్లాసిక్ టైటిల్ ని వాడుకుని నాని హిట్టు కొట్టేసాడు.నెక్స్ట్ మజ్ను. 1988లో వచ్చిన నాగార్జున లవ్ క్లాసిక్ పేరుని తీసుకున్నాడు నాని. తక్కువ బడ్జెట్ కావడంతో సేఫ్ అయ్యింది కాని మరీ బ్రహ్మాండంగా ఆడిన సినిమా అయితే కాదు

ఇక గత ఏడాది వచ్చిన కృష్ణార్జున యుద్ధం పేరుతో ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్-ఏఎన్ఆర్ కాంబోలో పౌరాణికం వచ్చింది. కాకపోతే దానికి శ్రీ అదనంగా ఉంటుంది. కాని నాని ఈ టైటిల్ తో తన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. ఇక దేవదాస్ సంగతి సరేసరి. నాగార్జున లాంటి సీనియర్ హీరో అండగా ఉన్నా దేవదాస్ తో నాని ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

ఇప్పుడు గ్యాంగ్ లీడర్ వంతు వచ్చింది. దీని సంగతి ఆగస్ట్ లో తేలుతుంది. మొత్తానికి పాతిక సినిమాలు దాటకుండానే నాని ఆరు క్లాసిక్ టైటిల్స్ వాడేసుకున్నాడు. వీటిలో చెప్పుకోదగ్గ హిట్స్ ఉన్నాయి కాని మరీ కెరీర్ ని అమాంతం మలుపు తిప్పినవి అయితే కాదు. మరి మాస్ సినిమాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న చిరు గ్యాంగ్ లీడర్ టైటిల్ తో ఎలాంటి ఫలితం అందుకోబోతున్నాడో చూడాలి
Tags:    

Similar News