విజయ్ 'జననాయగన్' ప్రీబుకింగుల దూకుడు
తమిళ సూపర్‌స్టార్ విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటించిన చివరి సినిమా జననాయగన్.;
తమిళ సూపర్‌స్టార్ విజయ్ పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు నటించిన చివరి సినిమా జననాయగన్. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. దళపతి ఫ్యాన్స్ ఉరకలెత్తే ఉత్సాహంతో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. తమిళనాడు రాజకీయాల్లో అంతకంతకు వేడి పెంచుతున్న విజయ్ విక్టరీ కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వేచి చూస్తున్నారు. ఈ సమయంలో విజయ్ అందుకుంటున్న పారితోషికం సహా మూవీ అడ్వాన్స్ బుకింగ్ ల గురించి బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
నిజానికి విజయ్ పారితోషికం మ్యాటర్ కి వస్తే, అతడు నటించిన గత చిత్రం `ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` (ది G.O.A.T.) కోసం సుమారు 170-200 కోట్ల మధ్య అందుకున్నాడని కథనాలొచ్చాయి. ఇప్పుడు జననాయగన్ కోసం ఏకంగా 100కోట్లు పెంచి 275 కోట్ల వరకూ అందుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అతడు లాభాలలో వాటా అడగలేదు. ప్రస్తుతానికి పారితోషికం విషయంలో అధికారిక వివరాలేవీ వెల్లడి కాలేదు.
విజయ్ క్రేజ్ తో జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్ లు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. జననాయగన్ మొదటి 24 గంటల్లోనే కేవలం యూకేలో మాత్రమే 12,700 టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. విజయ్ నటించిన `లియో` 10,000 టిక్కెట్ల అమ్మకాలను జననాయగన్ యూకేలో అధిగమించింది. తమ ఫేవరెట్ హీరో నటిస్తున్న చివరి సినిమా కాబట్టి ఫ్యాన్స్ చాలా ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. దీంతో ప్రీరిలీజ్ బజ్ సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. సినిమాలు వదిలేసి రాకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ కి ఈ సినిమా పెద్ద ప్లస్ కానుందని అంచనా. సంక్రాంతి పందెంలో భారీగా బాక్సాఫీస్ వద్ద జూదం ఆడే చిత్రంగా దీనికి హైప్ కనిపిస్తోంది.
ఇప్పటికే జననాయగన్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఇటీవల విడుదలైన రెండవ సింగిల్ `ఒరు పేరే వరలారు` ప్రజల్లోకి దూసుకెళ్లింది. విజయ్ అద్భుతమైన డ్యాన్సులు, అనిరుధ్ సంగీతం, సినిమాలో విజయ్ రాజకీయాలు, అభిమానుల ప్రేమతో కనెక్షన్ ఈ పాటలో ప్రతిబింబించాయి. ఈ సింగిల్ పాటకు చక్కని ప్రశంసలు కురిసాయి.
ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించగా, వెంకట్ కె కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ పొలిటికల్ డ్రామాలో అద్భుతమైన తారాగణం ఉంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించారు. దాదాపు 375 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం అదే స్థాయిలో బిజినెస్ చేయగా కనీసం 400కోట్లు నెట్ వసూలు చేయాల్సి ఉందని అంచనా వేస్తున్నారు.