11వ క్లాస్‌లో ఈ నటి చేసిన పనికి బెంబేలు
11వ తరగతి అంటే అంతగా లోకజ్ఞానం తెలియని టీనేజీ వయసు. 17 ప్రాయంలో తెలిసీ తెలియని తప్పులు చేసే దూకుడు ఉంటుంది.;
11వ తరగతి అంటే అంతగా లోకజ్ఞానం తెలియని టీనేజీ వయసు. 17 ప్రాయంలో తెలిసీ తెలియని తప్పులు చేసే దూకుడు ఉంటుంది. ఆ వయసులో మాయగాళ్ల వలలకు చిక్కితే జరిగే పరిణామాలు ఊహించనివి. కానీ కొందరు టీనేజీ అమ్మాయిలు ధైర్యంగా కొన్నిటిని ఎదుర్కొని ఆదర్శంగా నిలుస్తారు. నటి కం దర్శకురాలు రేవతి 11ఏళ్ల వయసులో తనకు ఎదురైన ఒక సన్నివేశంలో దుండగుడికి ఎలా బుద్ధి చెప్పారో వింటే అది అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపుతుంది.
ఇంటర్ (11వ క్లాస్) చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తున్న నన్ను ఒకడు అసభ్యంగా తాకాడు.. ఆ సమయంలో అతడు ఎవరో అనే భయం లేకుండా ఒక్కటిచ్చానని నటి రేవతి తెలిపారు. రేవతి చెప్పుకొచ్చిన ఈ సంఘటన నిజంగా స్ఫూర్తిదాయకం. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా అక్కడికక్కడే స్పందించడం అనేది తనలోని ధైర్యానికి నిదర్శనం.
నిజానికి చాలామంది అమ్మాయిలు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతారు. సిగ్గు బిడియం కారణంగా ధ్యైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోలేరు. కానీ రేవతి దానికి విరుద్ధంగా సూటిగా సమాధానమిచ్చారు. అంతేకాదు మగువలు తమపై అఘాయిత్యాలకు పాల్పడే దుండగుల విషయంలో ఉపేక్షించకూడదనే బలమైన సందేశాన్ని కూడా ఇచ్చారు. తప్పును సహిస్తే అది తిరిగి మనల్ని దహించివేస్తుంది.
నిజానికి రేవతి వ్యక్తిత్వం, విలువల గురించి చాలా సందర్భాలలో సన్నిహితులు చెప్పిన విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆ వయసులోనే అపరిచితుడికి బుద్ధి చెప్పడం తన ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది.
రేవతి సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా చాలా హుందాగా, స్పష్టమైన వ్యక్తిత్వంతో ఉంటారు. ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటం వల్ల ఇతర మహిళల్లో కూడా ధైర్యం పెరుగుతుంది. అమ్మాయిలు తమ ఆత్మరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంత ముఖ్యమో ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా రేవతి తన గళాన్ని వినిపించడం గొప్ప విషయం.
రేవతి మంచి పబ్లిక్ స్పీకర్ కూడా. తన మనసులో మాటను ముక్కుసూటిగా చెప్పడం, పదిమందిలో వేదికలపై బలమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం చాలాసార్లు ఆకర్షించింది. రేవతి సాటి నటీమణులకు కూడా ఆదర్శంగా నిలిచారు. నేటి యువతరం స్ఫూర్తి పొందేందుకు అవసరమైన గొప్ప లక్షణాలు తన సొంతం.
రేవతి నటించిన సినిమాలు
రేవతి కథానాయికగా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తన ముద్ర వేశారు. సీతమ్మ పెళ్లి, మానస వీణ, రావుగారి ఇల్లు, అంకురం వంటి చిత్రాలలో రేవతి నటించారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ సరసన నటించిన ప్రేమ (1989) చిత్రంలో రేవతి నటన యువహృదయాలను కొల్లగొట్టింది. గాయం, మౌనరాగం, అంజలి, గణేష్, ఈశ్వర్, మేజర్ (అడివి శేష్) వంటి చిత్రాల్లోను రేవతి నటించారు.