సోనుసూద్ - ఊర్వశి రౌతేలా ఆస్తులు ఈడీ జప్తు
ఆన్ లైన్ బెట్టింగ్ నేర కలాపాలపై ఈడీ పెద్ద ఎత్తున కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే.;
ఆన్ లైన్ బెట్టింగ్ నేర కలాపాలపై ఈడీ పెద్ద ఎత్తున కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పలువురు సినీప్రముఖులు, క్రీడాకారులపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకుంటోంది. వీరంతా విదేశాలకు అక్రమ సొమ్ముల్ని తరలించడంలో సహకరించారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై ఈడీ తీవ్రంగా దర్యాప్తును కొనసాగించింది. తాజా సమాచారం మేరకు.. టాలీవుడ్ విలన్ సోను సూద్, అందాల నటి ఊర్వశి రౌతేలా, క్రికెటర్ యువరాజ్ సింగ్, అంకుష్ హజ్రా, నేహా శర్మ, రాబిన్ ఉతప్ప, మిమి చక్రవర్తి సహా పలువురు ప్రముఖులకు చెందిన రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఏ- 2002) నిబంధనల ప్రకారం ఈడీ జప్తు చేసింది.
చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న 1- ఎక్స్ బెట్ యాప్ నిర్వాహకులపై ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాగా, ఎఫ్.ఐ.ఆర్ ల ఆధారంగా ఈడీ కూడా దర్యాప్తు కొనసాగిస్తోంది. వన్ ఎక్స్ బెట్ సరోగేట్ బ్రాండ్ లు 1xBat , 1xbat కూడా భారతదేశంలో అన్ లైన్ బెట్టింగ్, జూదాన్ని అలవాటు చేసాయి. తద్వారా యువతం చాలా డబ్బును పోగొట్టుకుంటున్నారని కూడా సర్వేలో తేలింది.అందుకే బెట్టింగ్ యాప్‌లతో సంబంధం ఉన్న సెలబ్రిటీలపై ఇప్పుడు ఈడీ కొరడా ఝలిపించింది. విదేశీ బెట్టింగ్ వేదికలకు ప్రచారం చేసిన సెలబ్రిటీల వివరాలను ఈడీ తన దర్యాప్తులో కనుగొంది. సర్రోగేట్ బ్రాండింగ్ ద్వారా 1xBet ను ప్రోత్సహించడానికి సెలబ్రిటీలు తమకు తెలిసీ విదేశీ సంస్థలతో ప్రకటనల ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఈడీ దర్యాప్తులో వెల్లడైందని జాతీయ మీడియాలు తమ కథనంలో పేర్కొన్నాయి.
వివిధ సామాజిక మాధ్యమాలు, ఆన్ లైన్ ప్రమోషన్, ప్రింట్ ప్రకటనల ద్వారా సెలబ్రిటీలు ఈ అక్రమ యాప్ లకు ప్రచారం కల్పించారు. అయితే ఈ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే వేదికలు భారతదేశంలో పనిచేయడానికి అధికారం లేదు. అక్రమ నిధులను దాచడానికి విదేశీ మధ్యవర్తులతో సెలబ్రిటీలు.. పొరలు పొరలుగా లావాదేవీలు సాగించడం ద్వారా విదేశాలలో డబ్బు దాచారని కూడా ఈడీ పేర్కొంది. ఈ ఆదాయాన్ని అక్రమ బెట్టింగ్ కార్యకలాపాల నుండి ఉత్పత్తి చేసిన నేరాల ఆదాయం (పివోసి)గా గుర్తించినట్టు ఈడీ పేర్కొంటోంది. ఈ కేసులో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ నిరంతరాయంగా కృషి చేస్తోంది.
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్‌ల తో సంబంధాలు ఉన్న తెలుగు చిత్రసీమ ప్రముఖులపైనా ఇంతకుముందు విచారణ కొనసాగిన సంగతి తెలిసిందే. దీనిలో పలువురు సినీతారలతో పాటు బుల్లితెర తారలు, బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కూడా ఉన్నట్టు విచారణలో నిగ్గు తేలింది.