దురంధర్ ముందు తలొంచిన అవతార్
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్, అవతార్ 2 చిత్రాలు దాదాపు 5 బిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.;
జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్, అవతార్ 2 చిత్రాలు దాదాపు 5 బిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సిరీస్ లో మూడో భాగం ఆశించిన రేంజును అందుకోవడంలో తడబడింది. ముఖ్యంగా భారతదేశంలో అవతార్ 3 (ఫైర్ అండ్ యాష్) ఓపెనింగుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.
అవతార్ ఈ శుక్రవారం భారతీయ బాక్సాఫీస్ వద్ద విడుదల కాగా, మొదటి రోజు కేవలం 20కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఈ శుక్రవారం నాటికి రణ్ వీర్ సింగ్ దురంధర్ 15వ రోజుకు చేరుకున్నప్పటికీ (రెండు వారాల తర్వాతా) 22కోట్లు వసూలు చేయడం సంచలనం. దురంధర్ సాధించిన ఈ రికార్డ్ చారిత్రాత్మకం. డే1 `అవతార్ 3` వసూళ్లను కొట్టేసిన 15వ రోజుగా చరిత్ర లిఖించబడింది.
దురంధర్ దూకుడు చూస్తుంటే, 2025లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా ఇప్పటికే 737 కోట్లు వసూలు చేసి 1000 కోట్ల క్లబ్ దిశగా ముందుకు సాగుతోంది. మరో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చావా రికార్డులను బ్రేక్ చేసిన దురంధర్, కాంతార చాప్టర్ 1 రికార్డులను కూడా తుడిచేస్తుందని అంచనా వేస్తున్నారు.
నిజానికి ఏ- రేటింగ్ అందుకుని కూడా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన వేరొక సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేదని ప్రశంసలు కురుస్తున్నాయి. స్పై థ్రిల్లర్ కాన్సెప్టులో వచ్చిన దురంధర్ దేశీయంగా 580 కోట్లు వసూలు చేయగా, విదేశీ వసూళ్లు 157 కోట్లుగా లెక్క తేలింది. 15వ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇకపై క్రిస్మస్ సెలవులు, సంక్రాంతి సెలవుల సమయంలో దురంధర్ అద్భుతాలు చేస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. బహుశా ఈ చిత్రం సంక్రాంతి సెలవులను ఎన్ క్యాష్ చేయగలిగితే కచ్ఛితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని కూడా భావిస్తున్నారు.
బాహుబలి 2, కేజీఎఫ్ 2, పుష్ప 2 తరహాలో దురంధర్ కూడా భారతదేశంలో మరో సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా చావా, కాంతార చాప్టర్ 1 రికార్డులను తుడిచేసి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ రేటెడ్ సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ 920కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించగా ఆ రికార్డును కూడా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.