జక్కన్న- మహేష్ 'వారణాసి'.. షూటింగ్ ప్లాన్ ఎలా ఉందంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వారణాసిపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వారణాసిపై అభిమానుల్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ ను సిటీలోని కోకాపేట, అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో నాన్ స్టాప్ గా కొనసాగిస్తున్నారు.
అయితే సినిమా యూనిట్ ఒక్క లొకేషన్ కే పరిమితం కాకుండా, కథకు అనుగుణంగా వేర్వేరు సెట్స్ లో సన్నివేశాలను ప్లాన్ చేస్తోంది. ఒకరోజు కోకాపేటలో, మరుసటి రోజు అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుతూ రాజమౌళి తన స్టైల్ కు తగ్గట్టుగా భారీ సెటప్ లతో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీన్స్, కొన్ని హై వోల్టేజ్ సీక్వెన్స్ లను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి సినిమాలంటే విజువల్ గ్రాండియర్ కు పేరుంది. అందుకే ప్రతి షాట్ ను చాలా జాగ్రత్తగా, పర్ఫెక్షన్ తో తీర్చిదిద్దుతున్నారు. మహేష్ బాబు కూడా పూర్తిస్థాయిలో షూటింగ్ లో పాల్గొంటూ, తన పాత్రకు తగ్గట్టు మేకోవర్ తో కనిపిస్తున్నారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లుక్ టెస్టులు, యాక్షన్ రిహార్సల్స్ పూర్తి చేసి ఫుల్ స్వింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, నెలాఖరులో విదేశీ షెడ్యూల్ కు మూవీ టీమ్ సిద్ధమవుతోంది. జార్జియాలో 15 రోజుల పాటు ప్రత్యేక షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ ప్రకృతి అందాల మధ్య కీలక సన్నివేశాలు, కొన్ని అడ్వెంచర్ సీక్వెన్స్ లు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాల మాదిరిగానే వారణాసి మూవీలో కూడా ఇంటర్నేషనల్ లొకేషన్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.
జార్జియా షెడ్యూల్ పూర్తయ్యాక మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చి నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ ను కొనసాగించనున్నారు. సిటీలోని మరిన్ని భారీ సెట్లు నిర్మించి, కథలో కీలకమైన సీక్వెన్స్ లు పూర్తి చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. షూటింగ్ షెడ్యూల్స్ ను ఎటువంటి బ్రేక్ లేకుండా సరైన విధంగా ప్లాన్ చేస్తూ సినిమా వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నారని వినికిడి.
అయితే వారణాసిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో, మహేష్ బాబు కెరీర్ లోనే ఇది అతిపెద్ద సినిమా అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్, అడ్వెంచర్ అంశాలతో మూవీ సాగుతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లో వరుస షెడ్యూల్స్, వెంటనే విదేశీ షెడ్యూల్ తో మహేష్- రాజమౌళి మూవీ షూటింగ్ జోరుగా సాగుతోందని చెప్పాలి. మరి భారీ చిత్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.