నాని మళ్లీ ట్రిపుల్ ధమాకానే

Update: 2017-10-20 23:30 GMT
ఓవైపు క్వాలిటీ చూపిస్తూనే.. మరోవైపు శరవేగంగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లిపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. వరుసగా మూడేళ్ల పాటు అతను ఏడాదికి మూడు సినిమాలతో పలకరిస్తున్నాడు. 2015లో ‘జెండాపై కపిరాజు’.. ‘ఎవడే సుబ్రమణ్యం’.. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలతో పలకరించాడు నాని. ఇక గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’.. ‘జెంటిల్మన్’.. ‘మజ్ను’ సినిమాలు వచ్చాయి నాని నుంచి. ఇక ఈ ఏడాది ఇప్పటికే ‘నేను లోకల్’.. ‘నిన్నుకోరి’ రిలీజయ్యాయి. ఈ ఏడాది ఆఖర్లో ‘ఎంసీఏ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు నాని.

నాని ప్లానింగ్ ఎంత పర్ఫెక్టుగా ఉందంటే.. వచ్చే ఏడాది కూడా అతడి సినిమాలు మూడు రిలీజవ్వబోతున్నాయి. ఇప్పటికే సెట్స్ మీద ఉన్న ‘కృష్ణార్జున యుద్ధం’ వచ్చే ఏడాది నాని నుంచి రాబోయే తొలి సినిమా. ఈ చిత్రం ఫిబ్రవరిలోనే విడుదలైపోతుందట. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు నాని.. నాగార్జునతో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమా.. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది ఆరంభంలో కొంచెం అటు ఇటుగా మొదలవుతాయి. ఈ రెండు సినిమాల్ని సమాంతరంగా చేయబోతున్నాడు నాని. ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో కొన్ని నెలల వ్యవధిలో విడుదలవుతాయట. అంటే వరుసగా నాలుగో ఏడాది కూడా నాని ట్రిపుల్ ధమాకా చూడబోతున్నామన్నమాట.
Tags:    

Similar News