నాని సినిమా.. మూడో రిలీజ్!

Update: 2020-12-25 10:23 GMT
వెండి తెరపై రెండో రిలీజ్ ఉండేది అప్పట్లో..! బాక్సాఫీస్ ను దున్నేసి.. ప్రేక్షకులను ఊపేసిన అత్యద్భుతమైన చిత్రాలు మాత్రమే సెకండ్ రిలీజ్ జరుపుకునేవి. అవి కూడా ఒకటీ అరా మాత్రమే. కానీ.. హీరో నాని సినిమా మాత్రం మూడు నెలల్లోనే ఏకంగా మూడో రిలీజ్ కు సిద్ధమైంది. మరి, ఇప్పుడు ప్రేక్షకుల పరిస్థితి ఏంటన్నదే తేలాల్సిన లెక్క.

లాక్ డౌన్ కాలంలో థియేటర్లు మూతపడడంతో పలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి నాని హీరోగా నటించిన ‘వి’. ఇంకా చెప్పాలంటే.. ఓటీటీలో స్ట్రీమ్ అయిన తెలుగు బిగ్ మూవీ కూడా ఇదే. భారీ హైప్ వచ్చిన ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌ భారీ ధరనే చెల్లించి కొనుగోలు చేసింది. కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. డిజాస్టర్ టాక్ తో పేలవ ప్రదర్శన చేసింది. సినిమా మొత్తం రొటీన్ రివేంజ్ డ్రామాతో నింపేశారనే విమర్శలు వినిపించాయి.

అయితే.. ఓటీటీలో రిలీజ్ అయిన సుమారు నెల రోజుల తర్వాత.. బుల్లితెరపై ‘వరల్డ్ ప్రీమియర్ షో’గా విడుదలైంది ‘వి’ మూవీ. అయితే.. కూడా జనాలను పెద్దగా ఆకర్షించలేకపోయిందీ చిత్రం. కేవలం 6.8 రేటింగ్ మాత్రమే సాధించింది. ఇతర సినిమాల రేటింగ్ తో కంపేర్ చేయడం అటుంచితే.. నాని గత సినిమాలతో పోల్చి చూసినా ఈ రేటింగ్ మరీ తక్కువగా ఉంది. నాని గత చిత్రం గ్యాంగ్ లీడర్ కు 8.6 టీఆర్పీ రాగా.. అంతకంటే ముందు నటించిన జెర్సీ సినిమాకు 8.8 రేటింగ్ వచ్చింది. దానికి ముందు నాగార్జునతో కలిసి నటించిన సినిమా దేవదాస్ కు కూడా 8.3 టీఆర్పీ వచ్చింది. వీటితో పోల్చి చూస్తే V సినిమా టీవీ స్క్రీన్ పైన కూడా ఫెయిల్ అయినట్టే లెక్క అంటున్నారు.

ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి వచ్చిన తొలి యాక్షన్ థ్రిల్లర్ ఇది. కానీ.. ఆయన స్థాయికి ఏమాత్రం తగిన విధంగా లేకపోవడంతో ప్రేక్షకులు నిట్టూర్చేశారు. అయితే.. ఓటీటీ రిలీజ్ కాబట్టి దీని ఫలితాన్ని అంచనా వేయడం కష్టమైంది. ఇప్పుడు థియేట్లలో సినిమాలు లేకపోవడంతో.. బిగ్ స్క్రీన్ పై రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.

2021 జనవరి 1న ‘వి’ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నాని కూడా దీని గురించి ట్వీట్ చేశాడు. అమేజాన్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నపుడే.. డిజిటల్ రిలీజ్ తర్వాత కొంత విరామానంతరం థియేటర్లలో రిలీజ్ చేసుకుంటామని నిర్మాత దిల్ రాజు హామీ తీసుకున్నాడు. డిజిటల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అమేజాన్ వాళ్లకు అభ్యంతరాలు ఉండకపోవచ్చని అంటున్నారు.

ఐతే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఇంత లేటుగా థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ప్రేక్షకులు ఈ సినిమాాను చూసేందుకు రావడం డౌటే అంటున్నారు. ఇంతకుముందు పాత సినిమాల్ని ప్రదర్శిస్తే వచ్చిన స్పందన అంతంతమాత్రమే. అదీకాకుండా.. లేటెస్ట్ గా రిలీజైన ‘సోలో బ్రతుకే సో బెటర్’కు మంచి స్పందనే వస్తోంది. మరి, ఇలాంటి పరిస్థితుల్లో ‘వి’ మూవీని చూడ్డానికి ఎంత మంది వస్తారనేది ప్రశ్న.
Tags:    

Similar News