వెట‌ర‌న్ న‌టుడి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం?

చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు భరత్ కపూర్ (80) కన్నుమూశారు.;

Update: 2026-04-28 04:30 GMT

చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన సీనియర్ నటుడు భరత్ కపూర్ (80) కన్నుమూశారు. ఏప్రిల్ 27 సోమవారం మధ్యాహ్నం ముంబైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు ఆయన సన్నిహితుడు, నటుడు అవతార్ గిల్ ధృవీకరించారు. భరత్ కపూర్ మరణవార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు సాగిన తన సినీ కెరీర్‌లో హిందీ న‌టుడు భరత్ కపూర్ సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా (విలన్) గొప్ప‌ గుర్తింపు తెచ్చుకున్నారు. హిందుస్థాన్ కీ కసమ్, సోనే పే సుహాగా, బలిదాన్ వంటి చిత్రాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా బర్సాత్, ఆఖ్రీ రాస్తా, నూరి, రామ్ బలరామ్, ఇంకార్ వంటి సినిమాల్లో ఆయన పోషించిన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తే. కేవలం వెండితెరపైనే కాకుండా.. రంగస్థలంపై కూడా ఆయన అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు.

భరత్ కపూర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం 6 గంటలకు సైన్ హాస్పిటల్ సమీపంలోని స్మశానవాటికలో జరిగాయి. ఈ అంతిమయాత్రలో రాకేష్ బేడీ, దర్శకుడు రమేష్ తల్వార్ వంటి పలువురు సినీ, నాటక రంగ ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. భరత్ కపూర్ మరణంపై అవతార్ గిల్ స్పందిస్తూ.. తమ ఐదు దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన తనకు అన్నయ్యలా, గురువులా ఉండేవారని త‌న‌ను కోల్పోవడం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30న నార్త్ బాంబే అసోసియేషన్‌లో ఆయన `చౌతా` (శాంతి సభ) కార్యక్రమం నిర్వహించనున్నారు.

వ్యక్తిగత జీవితంలో భరత్ కపూర్‌కు భార్య లోప, కుమారులు రాహుల్ - సాగర్ ఉన్నారు. ఆయన కుమార్తె కవిత కొన్ని ఏళ్ల క్రితమే మరణించారు. కుటుంబ సభ్యులతో ఎంతో అనుబంధం కలిగి ఉండే ఆయన చివరి వరకు నటనపై మక్కువను చాటుకున్నారు. ఒక వెటరన్ నటుడిగా భ‌ర‌త్ క‌పూర్ పోషించిన వైవిధ్యమైన పాత్రలు హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

ఆశా భోంస్లే స‌హా ప‌లువురు తార‌లకు ఇదే ముప్పు:

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో దిగ్గజ నటీనటులు వయోభారం- ఇతర ఆరోగ్య కారణాల వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో (బహుళ అవయవాల వైఫల్యం) కన్నుమూశారు. అలనాటి గాన కోకిల లతా మంగేష్కర్, నటసామ్రాట్ దిలీప్ కుమార్, బాలీవుడ్ మొదటి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా వంటి వారు సుదీర్ఘ కాలం అనారోగ్యంతో పోరాడి చివరికి వివిధ అవయవాల పనితీరు మందగించడంతో తుదిశ్వాస విడిచారు. అలాగే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్, ప్రముఖ నటులు శశి కపూర్, వినోద్ ఖన్నా, ఇటీవల మరణించిన అజాతశత్రువు రిషి కపూర్ వంటి వారు కూడా ఇదే తరహా ఆరోగ్య సమస్యలతో మరణించారు. అయితే గాన విదూషీమణి ఆశా భోంస్లే ఇటీవ‌లే మ‌ల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ కార‌ణంగా ఇహ‌లోకాన్ని వీడిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News