అదాశర్మకు 'ది కేరళ స్టోరి' రేంజు మళ్లీ ఎప్పుడు?
భారతీయ చిత్ర పరిశ్రమలో `ది కేరళ స్టోరీ` సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ.. నటిగా తనలోని సత్తాను నిరూపించుకుంది.;
భారతీయ చిత్ర పరిశ్రమలో `ది కేరళ స్టోరీ` సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అదా శర్మ.. నటిగా తనలోని సత్తాను నిరూపించుకుంది. ఆ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ట్యాలెంటెడ్ బ్యూటీకి భారీ మైలేజ్ లభించినా.. కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో తదుపరి విజయాలు నమోదు కాలేదు. ఇటీవల ఓ మూడు ప్రాజెక్టుల్లో నటించినా ది కేరళ స్టోరి రేంజులో ప్రభావం చూపకపవడం నిరాశపరిచింది. అదాలో ప్రతిభకు కొదవలేకపోయినా.. సరైన ప్రాజెక్టులు పడక రేసులో వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో.. తాజాగా ఒక ఆసక్తికర ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జాతీయ ఉత్తమ నటుడు మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి అదా శర్మ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `గవర్నర్: ది సైలెంట్ సేవియర్`. ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త క్యారెక్టర్ పోస్టర్లను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. మనోజ్ బాజ్‌పాయ్ వంటి అగ్ర నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదా శర్మకు కెరీర్ పరంగా గొప్ప అవకాశమని చెప్పాలి. ఈ చిత్రం 12 జూన్ 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా కథాంశం భారతదేశ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సాగే ఒక తీవ్రమైన పోరాటంగా కనిపిస్తోంది. ``ఇది ఒక యుద్ధం.. సైన్యాలు లేని యుద్ధం. దేశాన్ని పతనం కాకుండా కాపాడిన ఒకే ఒక్క వ్యక్తి కథ`` అంటూ విడుదల చేసిన ట్యాగ్ లైన్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ``నేను విఫలమైతే.. భారతదేశం విఫలమవుతుంది`` వంటి సంభాషణలు ఈ చిత్రం ఎంతటి ఉత్కంఠభరితమైన డ్రామాతో సాగుతుందో అర్థమయ్యేలా చెబుతోంది. భారతదేశం దివాళా తీసే స్థితిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాన్ని ఎలా కాపాడారనేదే ఈ చిత్ర ప్రధానాంశం.
ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా.. దిగ్గజ రచయిత జావేద్ అక్తర్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. చిన్మయ్ మాండ్లేకర్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. `ది కేరళ స్టోరీ` తర్వాత అదా శర్మకు మళ్ళీ అలాంటి ఘనవిజయాన్ని అందించగల సత్తా ఉన్న టీమ్ ఈ సినిమా వెనుక ఉంది. మనోజ్ బాజ్‌పాయ్ నటన.. బలమైన స్క్రీన్ ప్లే తోడైతే అదా శర్మకు ఇది మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.
ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ `ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3` విజయంతో జోరు మీదున్నారు. అటు అదా శర్మ కూడా ఈ `గవర్నర్` ప్రాజెక్టుపై భారీ ఆశలే పెట్టుకుంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న అదా శర్మకు.. 2026 జూన్ నెలలో విడుదలయ్యే ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఒకవేళ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తే... అదా శర్మ కెరీర్ మళ్ళీ మునుపటి వేగాన్ని పుంజుకోవడం ఖాయం.
అదా ఎంపిక సరైనదేనా?
చారిత్రక లేదా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే చిత్రాలు నటీనటులకు కమర్షియల్ సినిమాల కంటే ఎక్కువ గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయనేది వాస్తవం. కమర్షియల్ సినిమాలు కేవలం వినోదాన్ని అందించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించవచ్చు.. కానీ యదార్థ గాథలు నటీనటులకు తమలోని అసలైన నటనా ప్రతిభను నిరూపించుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. ఇటువంటి పాత్రల కోసం తారలు ప్రయత్నించే శారీరక మార్పులు.. హావభావాల రీసెర్చ్.. భావోద్వేగపూరిత ప్రదర్శనలు ప్రేక్షకులలో బలమైన ముద్ర వేయడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలను .. ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులను కూడా సంపాదించిపెడతాయి. అందుకే కేవలం స్టార్ ఇమేజ్ కోసం కాకుండా..ఒక నటిగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశించే వారు తరచుగా ఇలాంటి వాస్తవిక కథాంశాలనే ఎంచుకుంటారు. ఈసారి కూడా అదా శర్మ ఎంపిక సరైనదేనని విశ్లేషిస్తున్నారు.