ఓటీటీల క్షీణత - థియేటర్ల పునరుజ్జీవనం!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఇంటివద్దే కూర్చుని డిజిటల్ స్క్రీన్‌లపై సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఇంటివద్దే కూర్చుని డిజిటల్ స్క్రీన్‌లపై సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేట్రికల్ రంగానికి భవిష్యత్తు ఉంటుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ మద్య కాలంలో పరిస్థితులు మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం ఓటీటీల హవా క్రమంగా తగ్గుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు కారణం ప్రేక్షకులు మళ్లీ పెద్ద ఎత్తున థియేటర్ల బాట పడుతుండటమే.
ఈ మార్పునకు కారణం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో నాణ్యమైన ఆకట్టుకునే కొత్త కంటెంట్ కొరత ఏర్పడుతుందనే మాట బలంగా వినిపిస్తోంది .ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజమైన నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థల షేర్ వాల్యూ గణనీయంగా పడిపోవడానికి కూడా ఇదే బలమైన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎడా పెడా వెబ్ సిరీస్‌లు .. సినిమాలు విడుదల చేస్తున్నా? ప్రేక్షకులను థ్రిల్ చేసే సరికొత్త కథలు కరువయ్యాయి. ఈనేపథ్యంలో డిజిటల్ సబ్‌స్క్రైబర్‌లు క్రమంగా ఓటీటీల నుంచి దూరమవుతున్నారనేది ట్రేడ్ వర్గాల అంచనా.
అలాగే ఇంటి వద్ద బుల్లి తెరపై సినిమాలు చూసి విసిగిపోయిన ఆడియెన్స్ మళ్లీ బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం థియేటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. సినిమాను కాలక్షేపంగా కాకుండా గొప్ప విజువల్ ..ఆడియో అనుభవంగా భావించే సంస్కృతి మళ్లీ బలపడుతోంది. సినిమా హాల్స్‌లో లభించే ఆ సౌండ్ ఎఫెక్ట్స్, భారీ స్క్రీన్‌పై కనిపించే విజువల్ వండర్స్ ప్రేక్షకులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తుండటం విశేషం.
దర్శక, నిర్మాతలు కూడా ఈ పరిణామాన్ని గమనించి థియేట్రికల్ అనుభూతిని అందించే చిత్రాల నిర్మాణానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిసింది. ఓటీటీ రైట్స్‌ను నమ్ముకుని సినిమాలు తీసే పద్ధతికి మేకర్స్ క్రమంగా స్వస్తి చెబితే థియేటర్లకు మళ్లీ పూర్వ వైభవం దక్కుతుందన్నది కాదనలేని నిజం. థియేటర్లలో సినిమా ఆడిన తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అనే నిబంధనను కఠినంగా అమలు చేస్తుండటం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడమే ఏకైక మార్గంగా మారుతోంది. ఈ వ్యూహం బాక్సాఫీస్ కలెక్షన్లను గణనీయంగా పెంచడంలో విజయవంతమవుతోంది.
డిజిటల్ మాధ్యమాలు ఎన్ని వచ్చినా? పెద్ద తెరపై వందలాది మందితో కలిసి సినిమా చూసే అనుభూతిని ఏ ఓటీటీ యాప్ కూడా భర్తీ చేయలేదు. బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కలెక్షన్స్ మళ్లీ నమోదు కావడం చిత్ర పరిశ్రమకు ఆర్థికంగా ఎంతో ఊతమిస్తోంది. రాబోయే రోజుల్లో థియేట్రికల్ క్రేజ్ మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది. ఓటీటీల క్షీణత - థియేటర్ల పునరుజ్జీవనం పూర్తి స్థాయిలో జరిగితే తిరుగుండదు. కంటెంట్ ఎంత బలంగా ఉంటే? ప్రేక్ష కులు ఆటోమేటిక్‌గా థియేటర్లకు వస్తారనే సత్యాన్ని ఈ పరిణామాలు మరోసారి రుజువు చేస్తున్నాయి. బిగ్ స్క్రీన్ మ్యాజిక్ ఎప్పటికీ చెరిగిపోదని థియేట్రికల్ అనుభవం ఎప్పుడూ నంబర్ వన్‌గా నిలుస్తుందని తాత్కాలికంగా ఈ ట్రెండ్ చెప్పకనే చెబుతుంది.