సీనియ‌ర్ స్టార్లు ఇద్ద‌రు రెస్ట్ మోడ్ లోనే!

ప్రస్తుతం చిరంజీవి... బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నుంచి కొద్దిపాటి విరామం తీసుకున్నారు.

Update: 2026-07-29 10:11 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాలుగా మాస్ ఇమేజ్‌తో ఏలుతున్న ఇద్దరు దిగ్గజ హీరోలు మెగాస్టార్ చిరంజీవి -నటసింహం నందమూరి బాలకృష్ణ విశ్రాంతి బాట పట్టారు. వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉండే సీనియర్ స్టార్లు ఒకే సమయంలో షూటింగ్స్‌కు విరామం ఇవ్వడం సినీ వర్గాలలో, అభిమానులలో చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా ఏమాత్రం తీరిక లేకుండా ఏడాదికి పైగా శ్రమిస్తున్న ఇద్ద‌రు తాజాగా తలెత్తిన వ్యక్తిగత - ఊహించని పరిణామాల కారణంగా షూటింగ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తోంది.

ప్రస్తుతం చిరంజీవి... బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నుంచి కొద్దిపాటి విరామం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ పూర్తికాగా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించడానికి ముందు కొన్ని సాంకేతిక ఏర్పాట్లు .. స్క్రిప్ట్ పరమైన పనులు జరుగుతున్నాయి. అలాగే నిరంతర షూటింగ్‌ల వల్ల తలెత్తిన అలసటను తగ్గించుకోవడానికి తదుపరి గెటప్‌పై శ్రద్ధ పెట్టడానికి చిరంజీవి ఈ చిన్న గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నటసింహం నందమూరి బాలకృష్ణ విశ్రాంతి తీసుకోవడానికి ముఖ్యమైన శారీరక కారణం ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్ర షూటింగ్ సెట్స్‌లో బాలకృష్ణకు స్వల్ప గాయ‌మైంది. యాక్షన్ సీక్వెన్సులు షూట్ చేస్తున్న సమయంలో ఘటన జరగడంతో వైద్యులు కొన్ని వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ బాల‌య్య‌పై స‌న్నివేశాల‌కు బ్రేక్ వేసింది .

ఇలా సీనియర్ హీరోలద్దరూ ఒకే సమయంలో షూటింగ్స్‌కు దూరంగా ఉండటం టాలీవుడ్‌లో తాత్కాలికంగా చిన్నపాటి గ్యాప్‌ను తెచ్చినా? అభిమానులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నారని పూర్తిగా ఆరోగ్యంగా వెంటనే మళ్లీ గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్‌లో రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి కూడా బాబి సినిమా సెట్స్‌లోకి మరింత ఉత్సాహంగా తిరిగి రానున్నారు.

వయసుతో సంబంధం లేకుండా యంగ్ హీరోలకు సైతం పోటీనిస్తూ ఇప్పటికీ కష్టపడి యాక్షన్ సీన్లలో నటిస్తున్న సీనియర్ స్టార్ల అంకితభావం ప్రశంసనీయం. ఈ విరామ సమయం వారి ఆరోగ్యానికి, సినిమాల నాణ్యతకు ఎంతో దోహదపడుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అభిమానులు కోరుకునే విజువల్ ఫీస్ట్ అందించడానికి ఈ రెస్ట్ మోడ్ ఎంతైనా అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్ ల నుంచి స‌ద‌రు స్టార్లు రిలీవ్ అయిన వెంట‌నే చిరంజీవి కొత్త సినిమా షూట్ లో జాయిన్ అవుతారు. బాల‌య్య కొర‌టాల సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నారు.

Tags:    

Similar News